కేపీఆర్ ఫెర్టిలైజర్స్ విస్తరణ
- రూ. 1000 కోట్ల ప్రణాళిక
- వచ్చే యేడు తమిళనాడు, మహారాష్ట్రల్లో ప్లాంట్ల యోచన
సాక్షి ప్రతినిధి, కాకినాడ : దక్షిణాది రాష్ట్రాల్లో ఎరువులు, పురుగుల మందుల తయారీలో పేరొందిన బలభద్రపురంలోని కేపీఆర్ ఫెర్టిలైజర్స్ పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతోంది. దేశంలో ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో ఉత్పత్తులను విక్రయిస్తున్న ఈ కంపెనీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అడుగుపెట్టాలనుకుంటోంది.
విస్తరణకు అవసరమయ్యే నిధుల్లో కొంతభాగాన్ని సమీకరించేందుకు పబ్లిక్ ఇష్యూ జారీచేసి, ప్లాంట్లో ఉత్పత్తిని పెంచాలనుకుంటోంది. ప్రస్తుతం ఆరేడువందల కోట్ల టర్నోవర్తో నడుస్తున్న ప్లాంట్ను 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.1000 కోట్ల టర్నోవర్కు చేర్చాలనేది లక్ష్యంగా ఎంచుకుంది. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో మూతపడ్డ క్రాప్ కెమికల్స్ కర్మాగారాన్ని 2000 సంవత్సరంలో రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన కేపీఆర్ సంస్థ అదే ఏడాది కేపీఆర్ మెగా కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కర్మాగారాన్ని ప్రారంభించింది.
కేవలం పది మంది పనివారితో ప్రారంభమైన ఈ ప్లాంట్ ఇప్పుడు ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండువేల మందికి ఉపాధి కల్పిస్తోంది. 120 రకాల పురుగుమందులు, 10 రకాల ఎరువులు తయూరు చేస్తూ, ప్రస్తుతం రోజుకు 250 టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంది. సింగిల్ సూపర్ ఫాస్పేట్, లేఫ్సా, కాల్షియమ్ ఫాస్పేట్, సల్ఫ్యూరిక్ యూసిడ్, ఎన్పీకే వంటి ఎరువులు ఉత్పత్తి చేస్తోంది. అలాగే కర్నాటకలో కూడా 200 టన్నుల సల్ఫర్ ఉత్పత్తి చేసే ప్లాంట్ను కూడా నిర్వహిస్తోంది.
సింగిల్ సూఫర్ ఫాస్పేట్తో పాటు ఫార్మా రంగానికి వినియోగించే డైమిథేల్ సల్ఫేట్ కూడా ఇదే ప్లాంట్లో ఉత్పత్తి అవుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.650 కోట్ల టర్నోవర్కు చేరుకోవడంతో ప్లాంట్ను మరింత విస్తరించాలనే ఆలోచనకు వచ్చింది. దీనిలో భాగంగా 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్లాంట్ను సుమారు రూ.1000 కోట్లతో విస్తరించాలనే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ప్లాంట్లు ఏర్పాటు చేయాలనే యోచనలో కంపెనీ ఉంది.