'స్వార్థం ఉండకూడదనే పిల్లల్ని కనలేదు'
విజయవాడ: కృష్ణానది కరకట్టపై నిర్మించిన ప్రకృతి వైద్యాలయాన్ని ఎలాంటి లాభాపేక్ష లేకున్నా నిర్వహిస్తున్నానని మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు. తాను వ్యాపారం చేస్తున్నాని విమర్శించడం తగదన్నారు. స్వార్థం ఉండకూడదనే తాను పిల్లల్ని కనలేదని ఆయన అన్నారు. కృష్ణానది కరకట్టపై రాజుగారి అక్రమ నిర్మాణాలు అంటూ వచ్చిన వార్త కథనాలపై బుధవారం విజయవాడలో మంతెన సత్యనారాయణ రాజు సాక్షికి ప్రత్యేకంగా వివరణ ఇచ్చారు. ప్రకృతి వైద్యాలయం నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అన్నీ అనుమతులు పొందినట్లు ఆయన చెప్పారు.
ఆ తర్వాతే నిర్మాణం చేపట్టామని స్పష్టం చేశారు. కృష్ణానది కరకట్ట లోపల 4.75 ఎకరాల్లో ఐదంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు వెల్లడించారు. ప్రస్తుత నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజే మాకు ఈ స్థలం ఇచ్చారన్నారు. 18 ఎకరాల్లో షెడ్ల కోసం 2 వ సారి అనుమతులు తీసుకున్నాం... కానీ షెడ్లు నిర్మించలేదన్నారు. 3 నెలల కిందట ఆ అనుమతుల గడువు ముగిసిన మాట వాస్తవమే అని ఆయన అంగీకరించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే తాము వ్యవహరించామని మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు.