బీజేపీ సీనియర్ నేత ఇంటిపై బాంబు దాడి
కోల్కతా: ఓ బీజేపీ సీనియర్ నేత ఇంటిపై బాంబు దాడి జరిగింది. ఈ దాడిని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఇల్లు బీజేపీ నేత కృష్ణ భట్టాచార్యది చెబుతున్నారు. అయితే, ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. కోల్కతాలోని ఉత్తర్పురా ప్రాంతంలోగల భట్టాచార్య ఇంటిపై బాంబు దాడి జరిగిందని, అంతకుముందు జరిగిన పరిణామాల కారణంగానే టీఎంసీ నేతలు ప్రతిగా ఈ దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభిస్తున్నారు. ఓ చిట్ఫండ్ కుంభకోణానికి సంబంధించి మరో టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ్ని సీబీఐ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ అరెస్టులను వ్యతిరేకిస్తూ టీఎంసీ విద్యార్థి విభాగం తొలుత ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
కోల్కతాలోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై ఆ పార్టీ శ్రేణులు దాడి కూడా చేశాయి. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో వారిపై రాళ్లతో దాడులు చేశారు. ఈ ఘటనతో బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరెస్టు చర్యను సీఎం మమతా బెనర్జీ కూడా ఖండించారు. పెద్దనోట్ల రద్దును తాను, తమ పార్టీ నేతలు బాహాటంగా వ్యతిరేకిస్తుండటంతోనే రాజకీయ కక్షతో తమ పార్టీ ఎంపీలను కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు అరెస్టు చేయిస్తున్నదని, దీనికి తాను బెదిరేది లేదని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ అన్నారు. మొన్నటి వరకు నోట్లను బంధించిన మోదీ ఇప్పుడు తమ పార్టీని బంధించాలని అనుకుంటున్నారని అది మాత్రం ఆయనకు సాధ్యం కాదని మండిపడ్డారు.