రంగంలోకి కృష్ణ వారసురాలు!
బెంగళూరు: మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ బీజేపీలోకి చేరడంతో ఆయన కుమార్తె శాంభవి సిద్ధార్థ బీజేపీ తరపున రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించడం దాదాపుగా ఖాయమయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరు రాజరాజేశ్వరినగర్ నియోజకవర్గం టికెట్‌ను ఆమెకు ఇవ్వాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. తద్వారా బీజేపీ మరింత బలోపేతమవుతోందని ఆశిస్తున్నారు. కృష్ణకు ఆమే వారసురాలుగా ప్రచారంలో ఉంది. తన కుమార్తెకు కానీ, అల్లుడికి కానీ బీజేపీ టికెట్ ఇవ్వాలని కోరలేదని, అప్పగించిన భాధ్యతలను సక్రమంగా నెరవేర్చడమే ముఖ్య కర్తవ్యమని ఎస్ఎంకృష్ణ చెబుతున్నారు. కాగా ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
నేడు నగరానికి ఎస్ఎం కృష్ణ
మరోవైపు ఎస్ఎం కృష్ణ ఇవాళ (శుక్రవారం) బెంగళూరు రానున్నారు. నంజనగూడు, గుండ్లుపేట ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారని బీజేపీ సీనియర్‌నేత ఆర్.అశోక్ తెలిపారు. ఢిల్లీ నుంచి నగరానికి చేరుకోనున్న ఆయనను ఊరేగింపుగా స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేయగా, ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు వస్తాయని కృష్ణ వారించారని చెప్పారు. ఎయిర్‌పోర్టు నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకుని పార్టీ నేతలతో సమావేశమవుతారని తెలిపారు.