జూలై 15 నుంచి కృష్ణా హారతి
- నిర్వహణ బాధ్యతలు డీవీఆర్ ఫౌండేషన్‌కు
- విరాళాలిచ్చిన వారి పేరుతో హారతి పూజలు
సాక్షి, హైదరాబాద్: గంగా, గోదావరి హారతి తరహాలోనే ఈ ఏడాది జులై 15వ తేదీ నుంచి విజయవాడ కేంద్రంగా కృష్ణా హారతి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి రోజూ సూర్యస్తమయ సమయంలో నది ఒడ్డు నుంచి వేద పండితులు హారతి ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. హారతి కార్యక్రమ నిర్వహణకు జలవనరుల శాఖ ప్రత్యేకంగా రెండు పంట్లను ఏర్పాటు చేస్తోంది. విజయవాడ నగరానికి చెందిన డీవీఆర్ పౌండేషన్‌కు హారతి కార్యక్రమ నిర్వహణ బాద్యతలను అప్పగించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు అయ్యే ఖర్చులో 75 శాతం డబ్బులను దుర్గామల్లేశ్వరస్వామి వారి ఆలయ నిధులను ఖర్చు చేస్తారు. మిగిలిన 25 శాతం ఖర్చులను డీవీఆర్ ఫౌండేషన్ భరిస్తోంది.
కాగా, దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయ అధికారులు హారతి కార్యక్రమ నిర్వహణకు భక్తులను విరాళాల సేకరణకు దేవాదాయ శాఖ అనుమతి తెలిపింది. విరాళాల అందజేసే వారి పేరిట హారతి సమయంలో గోత్ర నామాలతో పూజా నిర్వహించడంతో పాటు దాతలకు హారతి వేదిక వద్దే వేదపండితులు ఆశ్వీరవచనం అందజేస్తారు. సాధారణ రోజుల్లో హారతి నిర్వహణకు వెయ్యి రూపాయలు, పండుగ రోజుల్లో రెండు వేల రూపాయలు, శాశ్వత నిత్య హారతి కార్యక్రమ నిర్వహణకు రూ. 25 వేల విరాళం అందజేయాల్సి ఉంటుంది. కార్తీక మాసంలో దాతల పేరిట హారతి నిర్వహణకు రూ. 25 వేలు విరాళం అందజేయాల్సి ఉంటుంది.