రోడ్డుపై షూటింగ్.. ట్రాఫిక్ జామ్
కృష్ణరాజపుర(బెంగళూరు): నిరంతరం ట్రాఫిక్ రద్దీగా ఉండే టిన్ ఫ్యాక్టరీ వద్ద సోమవారం జాతీయ రహదారిలో అనుమతి లేకుండా టీవీ సీరియల్ చిత్రీకరణ చేయడంతో సుమారు రెండు కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఐటీఐ ఊయల వంతెన పైభాగంలో ఒక రోడ్డుపై టీవీ సీరియల్ బృందమొకటి చిత్రీకరణ చేస్తుండటంతో మరో రోడ్డు నుంచి షూటింగ్ చూసేందుకు కొందరు వాహనాలను నిలపడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఇక టిన్ ఫ్యాక్టరీ రోడ్డు, హెబ్బాళ, ఐటీపీఎల్, ఆనేకల్, తిరుపతి తదితర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రముఖ నగరాలకు వెళ్లే అన్ని వాహనాలూ ఇదే మార్గంగుండా సంచరిస్తాయి. దీంతో ప్రతినిత్యం ఇక్కడ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. షూటింగ్‌కు వచ్చిన సీరియల్ బృందం అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మండుతున్న ఎండలో ప్రయాణికులను రద్దీలో ఇరికించడంతో వాహన చోదకుల ఆగ్రహానికి కారణమైంది. కిలోమీటర్ల పొడవునా ఏర్పడిన రద్దీతో ప్రయాణికులు పడిన పాట్లు వర్ణనాతీతం. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు షూటింగ్‌ను నిలిపివేయించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.