గిరిజనుల దేవుడు ‘అల్లూరి’
ఈడేపల్లి (మచిలీపట్నం) : మన్యం వాసులకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అందించి వారిగుండెల్లో దేవుడైన అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయులకు సింహస్వప్నంగా నిలిచాడని డెప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు మచిలీపట్నం కృష్ణావిశ్వవిద్యాలయ ఆడిటోరియంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా బుద్దప్రసాద్ పాల్గొని మాట్లాడారు.
గిరిజనుల ఆశాజ్యోతిగా చరిత్ర ప్రసిద్ధిచెందిన సీతారామరాజు జయంతిని ప్రభుత్వ వేడుక గా నిర్వహించడం ముదావహమన్నారు. ధైర్యానికి, పరాక్రమానికి, తెలుగువారి పౌరుషానికి నిలువెత్తు నిదర్శనంగా అల్లూరి నిలిచాడని బీసీ సంక్షేమ, ఎక్సైజ్, చేనేత శాఖల మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు. సీతారామరాజు అసమాన చరిత్ర పురుషుడని శ్లాఘించారు. అల్లూరిని ఆంగ్లేయులు కాల్చినప్పుడు ‘ఈ ఉద్యమం ఆగబోదు. ఎప్పటికైనా మీరు మాగడ్డ వదిలి పారిపోక తప్పదు.
వందేమాతరం..వందేమాతరం’ అంటూ తుదిశ్వాస విడిచారని గుర్తుచేశారు. సీతారామరాజు స్ఫూరితో యువతరం ముందుకు సాగాలని కలెక్టర్ ఎమ్. రఘునందనరావు, ఎస్పీ జె ప్రభాకరరావు పేర్కొన్నారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు పాండురంగారావును అతిథులంతా దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమ ప్రారంభానికి ముందుగా అతిథులంతా అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనం గా నివాళులు అర్పించారు.
విశ్వవిద్యాలయ ఉపకులపతి వి. వెంకయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ మురళీ, ట్రైనీ కలెక్టర్ సృజన, టీడీపీ నాయకుడు కొనకళ్ల బుల్లయ్య, రిజిస్ట్రార్ డి. సూర్యచంద్రరావు, మచిలీపట్నం డీఎస్పీ , ఆర్డీవో, తహసీల్దారులు శ్రీనివాసరావు, సాయిబాబా, నారదముని, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, పలుకళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
అల్లూరి జయంతి వేడుకల్ని పురస్కరించుకుని కృష్ణా విశ్వవిద్యాలయ(కేయూ) పరిధిలోని అన్ని కళాశాల్లో విద్యార్థులకు వక్తృత్వం, వ్యాసరచన, ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహించారు. వీటిలో విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. తెలుగు మీడియం విభాగం వక్తృత్వంలో ప్రథమ, ద్వితీయ బహుమతులు ఎమ్ఎల్ ఆదిత్య(కేయూ), వి. స్రవంతి (బాలసాయి డిగ్రీ కళాశాల ) పొందారు. వ్యాసరచనలో మొదటి రెండు బహుమతులను వి. స్రవంతి (బాలసాయి డిగ్రీ కళాశాల), రమ్య (పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల) కైవసం చేసుకున్నారు. ఇంగ్లిష్‌మీడియం విభాగం వక్తృత్వంలో సీహెచ్ లక్ష్మీభార్గవి (బాలసాయి డిగ్రీకళాశాల), జె. స్వర్ణలతా రాజ్ (పద్మావతి బీఈడీ కళాశాల) ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారు. వ్యాసరచనలో మొదటి, రెండో స్థానాలు వరుసగా వీహెచ్ రమ్య(కేయూ), సీహెచ్ లక్ష్మీభార్గవి (బాలసాయి డిగ్రీ కళాశాల)సాధించారు. అల్లూరి సీతారామరాజు ఏక పాత్రాభినయం పోటీలో ప్రథమ, ద్వితీయ బహుమతులు వరుసగా కృష్ణావిశ్వవిద్యాలయానికి చెందిన ఎమ్.ఎల్. ఆదిత్య (ఎమ్ఏ తెలుగు), అనిల్‌కుమార్ (బయోటెక్నాలజీ) సాధించారు.
రామరాజును ఆదర్శంగా తీసుకోవాలి
నూజివీడు : బ్రిటీష్ సామ్రాజ్యంపై అలుపెరగని పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజును యువత ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పట్టణంలోని పీజీ కేంద్రంలో శుక్రవారం అల్లూరి జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉమా మాట్లాడుతూ నూజివీడు పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు రానున్నాయని చెప్పారు.
నూజివీడు మామిడికి ఒక ట్రేడ్మార్కును ఏర్పాటుచేసి ప్రపంచదేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పారు. సబ్‌కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు మాట్లాడుతూ సీతారామరాజు దేశంకోసం ప్రాణాలు అర్పించిన గొప్ప త్యాగశీలి అన్నారు. విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పీజీ కేంద్రం ప్రత్యేకాధికారి బసవేశ్వరరావు, సీనియర్ సిటిజన్లు మంగరాజు, బత్తుల వీరమ్మ, నూజివీడు నూతన ఎంపీపీ తొమ్మండ్రు శ్రీనివాసరావు, ఐదోవార్డు కౌన్సిలర్ కందుల సత్యనారాయణ పాల్గొన్నారు.
అంతా గోప్యం
సీతారామరాజు జయంతుత్య్సవాలను పీజీకేం ద్రం ప్రత్యేకాధికారి మండవ వెంకట బసవేశ్వరరావు గోప్యంగా నిర్వహించుకున్నారు. రాష్ట్ర మంత్రి పాల్గొనే కార్యక్రమమైనా కనీసం సమాచారశాఖకు కూడా తెలియజేయలేదు. దీనిపై మీడియాకుకూడా తెలియజేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.