బాబు వచ్చి జాబులు పోగొడుతున్నారు
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమాచార్యులు విమర్శ
ఏలూరు అర్బన్ : జాబు కావాలంటే బాబు రావాలంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే పనిలో పడ్డారని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణమాచార్యులు విమర్శించారు. ఆదివారం స్థానిక స్ఫూర్తి భవన్లో జరిగిన ఏఐటీయూసీ మహాసభలో కృష్ణమాచార్యులు పాల్గొని ప్రసంగించారు. పొరుగు రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికులను, ఉద్యోగులను పర్మినెంట్ చేస్తుంటే చంద్రబాబు ఉన్నవారిని ఇంటికి పంపుతున్నారని ఎద్దేవా చేశారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ఉద్యోగ, కార్మికుల శ్రేయస్సు కోసం సీపీఐ పోరాడుతుందని స్పష్టం చేశారు. అనంతరం నిర్వహించిన ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్షుడిగా కె. కృష్ణమాచార్యులు, ఉపాధ్యక్షులుగా కె.అప్పారావు, ప్రసాద్, అలీ సమ్మ, కార్యదర్శిగా ఆర్.శ్రీనివాస డాంగే, ఉప కార్యదర్శిగా పేరలింగం తదితరులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.