డబ్బు కోసం మేనమామ కిరాతకం
హైదరాబాద్, న్యూస్‌లైన్: అభం శుభం తెలియని ఐదేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. వరుసకు మేనమామ అయిన వ్యక్తే ఈ హత్యకు పాల్పడటం సంచలనం సృష్టించింది. హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. జాలీ హనుమాన్‌లో నివసించే ఆర్.అనిల్‌కుమార్ (34) అబిడ్స్ చర్మాస్‌లో సేల్స్‌మన్. అతడు భార్య దీపిక, కుమారుడు యశ్‌రాజ్ కుమార్(5), కుమార్తె రితిక (3)తో కలిసి ఉంటున్నారు. యష్‌రాజ్ జిన్సీచౌరాహిలోని కృష్ణవేణి పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు దీపిక చిన్నాన్న కొడుకు వినోద్ ఇంటికి వచ్చి బాలుడికి చాక్లెట్ ఇచ్చి తీసుకెళ్లాడు. మేనమామ కావడంతో యశ్‌రాజ్ అతడితో వెళ్లాడు.
రాత్రి వినోద్.. బావ అనిల్‌కు ఫోన్‌చేసి డబ్బు కోసం డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన వినోద్ యశ్రాజ్ను బండ్లగూడ పీరంచెరువు దగ్గరకు తీసుకెళ్లి దారుణంగా హత్యచేశాడు. బుధవారం ఉదయం బాలుడు రక్తపు మడుగులో నిర్జీవంగా ఉండటాన్ని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
బాలుడిని గుర్తు పట్టకుండా ఉండేందుకు వినోద్ పెట్రోలుతో ముఖాన్ని తగల బెట్టాడు. నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. యష్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో శవపరీక్షలు నిర్వహించారు. తలపై బండతో మోది గొంతును వైరుతో బిగించి హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయని ఉస్మానియా ఫోరెన్సిక్ విభాగాధిపతి టకియుద్దీన్ తెలిపారు.
చాక్లెట్‌తోనే బహిర్గతం: ఎప్పుడూ తమ బాబుకు చాక్లెట్ ఇవ్వని వినోద్ మంగళవారం ఎందుకు ఇచ్చాడనే అనుమానం దీపికకు కలిగింది. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నట్లు సమాచారం. మెకానిక్‌గా పనిచేసే వినోద్ కొన్నాళ్లుగా పనిచేయకుండా తిరుగుతున్నాడు.