అద్వానీకి షాక్
దోహా: ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌లో టాప్ సీడ్, భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీకి అనూహ్య ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ అద్వానీ 3-5 (46-86, 64-21, 0-142, 99-0, 5-71, 99-18, 28-77, 31-66) ఫ్రేమ్‌ల తేడాతో క్రిట్సానట్ లెర్ట్సటాయాథోర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు.
ఇప్పటికే 14 ప్రపంచ టైటిల్స్‌ను సాధించిన అద్వానీకి ఈ మ్యాచ్‌లో తన ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. మూడో ఫ్రేమ్‌లో క్రిట్సానట్ భారత స్టార్ ప్లేయర్‌కు ఒక్క అవకాశం ఇవ్వకుండా ఏకంగా 142 పాయింట్ల బ్రేక్‌ను సాధించాడు. ఆ తర్వాత పంకజ్ తేరుకున్నా చివర్లో క్రిట్సానట్ నిలకడగా ఆడి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.