అమెరికాలో భారతీయ బాలికకు రూ.1.4 కోట్ల పరిహారం!
భారత దౌత్యవేత్త కుమార్తెపై తప్పుడు ఆరోపణలు చేసి, ఆమెను ఒకరోజు జైల్లో కూడా పెట్టిన అమెరికన్ అధికారులు.. ఆమెకు నష్టపరిహారంగా రూ. 1.4 కోట్లు చెల్లించేందుకు అంగీకరించారు. టీచర్‌కు అసభ్య ఈమెయిళ్లు పంపిందన్న అనుమానంతో కృతికా బిశ్వాస్ అనే బాలికను స్కూలు నుంచి సస్పెండ్ చేయడమే కాక, ఒకరోజు జైల్లో కూడా పెట్టారు. దాంతో ఆమె న్యూయార్క్ నగర అధికారుల మీద, విద్యాశాఖ మీద కోర్టులో కేసు పెట్టింది. ఇదంతా 2011లో జరిగింది. దీనిపై విచారించిన అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ కోల్టెల్ అధికారులను ఆమెకు పూర్తి సంతృప్తి కలిగేలా 1.4 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. దాంతో కేసులన్నింటినీ ఉపసంహరించుకునేందుకు బిశ్వాస్ అంగీకరించారు.
కృతికా బిశ్వాస్కు, భారత దౌత్యవేత్తలకు, భారతదేశానికి పరువుకు భంగం కలిగేలా వ్యవహరించినందుకు కోర్టు అధికారులను మందలించినట్లు బిశ్వాస్ న్యాయవాది రవి బాత్రా తెలిపారు. బిశ్వాస్ చాలా గౌరవప్రదమైన విద్యార్థిని అని సెటిల్మెంట్ సమయంలో అధికారులు పేర్కొన్నారు. తనకు ఇన్నాళ్లు అండగా నిలబడినందుకు భారత అమెరికన్ సమాజం, మాజీ రాయబారులు ప్రభు దయాళ్, మీరాశంకర్, మాజీ క్లాస్మేట్లు, టీచర్లు.. అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది.