ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత అక్కినేని చేసిన సినిమా ఇదే!
పాపులర్ నవలల్ని తెర మీదకు తెస్తే? అంతకన్నా సక్సెస్ ఫార్ములా ఇంకేముంటుంది! ‘సెక్రటరీ’... యద్దనపూడి సులోచనారాణిని మోస్ట్ పాపులర్ రైటర్ని చేసిన నవల. ‘ప్రేమనజర్’ కాంబినేషన్ – దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు, అక్కినేని, వాణిశ్రీ లతో సురేశ్మూవీస్ రామానాయుడుకు ‘నవలా చిత్రాల నిర్మాత’ అన్న పేరును సుస్థిరం చేసిన నవల. వంద ముద్రణలు జరుపుకొన్న ‘సెక్రటరీ’ నవలకు ఇప్పుడు 55 వసంతాలు. నవలను సినిమాగా తీసినప్పుడుండే సహజమైన విమర్శలు, భిన్నాభిప్రాయాల మధ్యనే శతదినోత్సవం జరుపుకొన్న ఆ నవలాధారిత చిత్రానికి 45 ఏళ్ళు.
అంతర్జాతీయ మహిళా వత్సరం!
అరవై ఏళ్ళ క్రితం సంగతి. అప్పటి దాకా వంటింటికే పరిమితమైన మధ్యతరగతి అమ్మాయిలు చదువుకొని, కుటుంబ అవసరాల రీత్యా రెక్కలు విప్పుకొని, గడప దాటి ఉద్యోగాలు చేయడం అప్పుడప్పుడే మొదలైంది. మారుతున్న సమాజాన్నీ, చుట్టూ ఉన్న హైక్లాస్ ప్రపంచాన్నీ, అందులోని మనుషులనూ చూస్తూ... అటు మొగ్గలేని, ఇటు మధ్యతరగతి విలువలలో మగ్గలేని ఊగిసలాట ఉంది.
ఆ నేపథ్యంలో సెక్రటరీ ఉద్యోగం చేసిన జయంతి అనే అమ్మాయి కథ – యద్దనపూడి రాసిన, రామానాయుడు తీసిన – ‘సెక్రటరీ’. 1975ను ‘అంతర్జాతీయ మహిళా సంవత్సరం’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆ కాలఘట్టంలో, నవల వెలువడ్డ పదేళ్ళకొచ్చిన చిత్రం ‘సెక్రటరీ’. రచనలోనూ, తెరపైనా చివరకు పురుషాధిక్యమే బలంగా కనపడినప్పటికీ, ‘‘ఒకరిలా ఉండాల్సిన అవసరం నాకేం లేదు. నేను నేనుగా ఉండడమే నాకిష్టం’’ అనే వ్యక్తిత్వమున్న జయంతి పాత్రలో వాణిశ్రీ రాణించిన సందర్భమది.
స్టార్ హీరోకు... సెకండ్ ఇన్నింగ్స్!
మహిళాదరణ ఉన్న హీరోగా అక్కినేని కెరీర్లో ‘సెక్రటరీ’ది ప్రత్యేక స్థానం. అప్పట్లో గుండె జబ్బుకు చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్ళారు. తీరా అప్పటికప్పుడు 1974 అక్టోబర్ 18న ఆయనకు ఓపెన్ హార్ట్సర్జరీ చేశారు. డిసెంబర్ మొదట్లో స్వదేశానికి తిరిగొచ్చినా, కొద్దికాలం విశ్రాంతి తీసుకున్నారు. దాంతో, 1975లో ఆయన కొత్త సినిమాలేవీ రిలీజు కాలేదు. పాత ప్రాజెక్ట్ ‘మహాకవి క్షేత్రయ్య’ను కొనసాగించారు. కానీ, పూర్తిస్థాయిలో అక్కినేని రెండో ఇన్నింగ్స్ మొదలెట్టింది ‘సెక్రటరీ’తోనే!
అక్కినేని మానసిక సంఘర్షణ...
అప్పట్లో సారథీ స్టూడియో అందుబాటులో లేక, తాను ఒకప్పుడు కాదని వచ్చేసిన మద్రాసుకు మళ్ళీ షూటింగులకు వెళ్ళలేక అక్కినేని ఇరుకున పడ్డారు. అమెరికా పర్యటనకు ముందెప్పుడో మొదలై, కుంటినడక నడుస్తున్న ‘క్షేత్రయ్య’ పూర్తి చేయడం కోసం చివరకు బెంగుళూరుకు వెళ్ళాల్సి వచ్చింది.
కోయంబత్తూరు పక్షిరాజా స్టూడియోస్ అధినేత శ్రీరాములు నాయుడు అక్కడ బెంగుళూరులో బొబ్బిలి రాజా ప్యాలెస్ కొని, 1969 నుంచి ‘చాముండేశ్వరీ స్టూడియోస్’ నిర్వహిస్తున్నారు. అక్కడ అక్కినేని తన ‘క్షేత్రయ్య’ షూటింగ్ జరపాల్సి వచ్చింది. అప్పుడిక విధి లేక... సొంత స్టూడియో ఉండాలనే ఆలోచనతో, ‘అన్నపూర్ణా స్టూడియోస్’కు శ్రీకారం చుట్టారు. నిర్మాత దుక్కిపాటి సహా శ్రేయోభిలాషులు వద్దన్నా సరే... అక్కినేని సాహసించారు.
అక్కడ తొలి షూటింగ్... ఇదే!
అన్నపూర్ణా స్టూడియోస్ 1976 జనవరి 14 సాయంత్రం నాలుగు గంటల వేళ ప్రారంభమైంది. అప్పట్లో కొండలు, గుట్టలుగా, సరైన రోడ్డు కూడా లేని ప్రాంతం అది. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు అండతో అక్కినేని స్వయంగా దేశ రాష్ట్రపతిని ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. దేశ ప్రథమ పౌరుడి ప్రోటోకాల్ ఏర్పాట్లతో స్టూడియోకు రోడ్డు పడింది.
అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సతీసమేతంగా వచ్చి, స్టూడియోను ప్రారంభించారు. అప్పటికి స్టూడియోలో ఒక్క ఫ్లోరే సిద్ధమైంది. ఆ ఫ్లోర్‌లోనే ‘సెక్రటరీ’ మొదలెట్టారు నిర్మాత రామానాయుడు. సినీపరిశ్రమను హైదరాబాద్‌కు తేవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, ప్రోత్సా హాలకు అనుగుణంగా ఆవిర్భవించిన అన్నపూర్ణా స్టూడియోలో చిత్రీకరణైన తొలిచిత్రం ‘సెక్రటరీ’.
ఆ కథ ఎన్నో చేతులు మారి...
జయంతి (వాణిశ్రీ), రాజశేఖరం (అక్కినేని) నాయికా నాయకులు. ఎదుటపడితే ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు. చాటున మాత్రం ఒకరినొకరు తలుచుకుంటారు. ఒకరికి పొగరు. వేరొకరికి బిగువు. పొగరు దిగి, బిగువు సడలి ఇద్దరి మధ్య ఎలా జత కుదిరిందన్నది ‘సెక్రటరీ’ కథ. దీన్ని సీరియల్‌గా రాసేటప్పటికి యద్దనపూడికి నిండా పాతికేళ్ళు లేవు. గర్భవతి. అలా 1964 – 65ల్లో ఆమె రాసిన ఆ నవల ఓ ఊపు ఊపేసింది. ఆ రోజుల్లో పడవ లాంటి కారు, మేడ, తోట, నౌకర్లున్న ఆరడుగుల అందగాడైన రాజశేఖరం లాంటి అబ్బాయి తమకు భర్త కావాలని కోరుకోని మధ్యతరగతి అమ్మాయిలు లేరు. అలాగే, ఆత్మాభిమానం నిండిన జయంతిలో తమను తాము వారు చూసుకున్నారు.
1966లో తొలి ముద్రణ నుంచి ఇప్పటికి వంద ఎడిషన్లు... వేల కాపీలు... లక్షలాది పాఠకాభిమానంతో తెలుగు నవలా సాహిత్యంలో రికార్డు సృష్టించిన నవల – ‘సెక్రటరీ’. అప్పట్లో ఆ నవలను తెరకెక్కించాలని చాలామంది అనుకున్నారు. ఆ నవల ఎన్నో ఏళ్ళు, ఎందరి చేతులో మారింది. చివ రకు రామానాయుడికి ఆ అదృష్టం దక్కింది. అప్పటికే పాపులర్ నవలల ఆధారంగా వరుసగా ‘ప్రేమనగర్’, ‘జీవన తరంగాలు’, ‘చక్రవాకం’ చిత్రాలు తీసిన ఆయన ‘సెక్రటరీ’ని రిచ్‌గా నిర్మించారు.
ఆ పాటలు... ఆ వ్యూహాలు!
‘సెక్రటరీ’ కన్నా నెల రోజుల ముందు ‘క్షేత్రయ్య’ (1976 మార్చి 31) రిలీజైంది. దాన్ని పక్కనపెడితే, ‘దొరబాబు’ (1974 అక్టోబర్ 31) తర్వాత దాదాపు ఏణ్ణర్ధం గ్యాప్‌తో జనం ముందుకు అక్కినేని ఉత్సాహంగా వచ్చిన సినిమా ‘సెక్రటరీ’యే (1976 ఏప్రిల్ 28)! నవలా చిత్రమనే క్యూరియాసిటీ, మంచి పాటలు కలగలిసి సినిమా రిలీజుకు మంచి క్రేజు వచ్చింది. ఆ రోజుల్లో అనూహ్యమైన అడ్వా¯Œ ్స బుకింగ్‌తో కలకలం రేపింది. మంచి ఓపెనింగ్స్ సాధించింది. రామకృష్ణ గళంలో హుషారు గీతం ‘నా పక్కనచోటున్నది ఒక్కరికే...’, ఆత్రేయ మార్కు విషాద రచన ‘మనసు లేని బ్రతుకొక నరకం...’ పాటలు హిట్.
ప్రేక్షక జనాకర్షణ కోసం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు మంచి వ్యూహాలే వేశారు. నవలలోని పాత్రలకు జనంలో ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని, సినిమా టైటిల్స్‌లో తారల పేర్ల బదులు వారి ఫోటోలు పెట్టి, రాజశేఖరం, జయంతి లాంటి నవలా పాత్రల పేర్లే వేశారు. ‘మొరటోడు నా మొగుడు..’ పాటను సినిమా రిలీజైన కొన్నాళ్ళకు కొత్తగా కలిపారు. అప్పట్లో ఎన్టీఆర్, దిలీప్ కుమార్ సారథ్యంలో దక్షిణాది, ఉత్తరాది సినీతారల మధ్య హైదరాబాద్ ఎల్బీ స్టేడియమ్లో బెనిఫిట్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. రిలీజైన అయిదారు వారాలకు ‘సెక్రటరీ’తో పాటు ఆ మ్యాచ్ దృశ్యాల రీలును ప్రదర్శించారు.
కానీ, భారీ అంచనాలతో హాలుకొచ్చిన నవలా పాఠకుల ఊహలను సినిమా అందుకోలేకపోయింది. ‘సక్సెసైనా, మేము ఆశించిన అద్భుత విజయం దక్కలేదు. రిపీట్ రన్లో లాభాలొచ్చాయి’ అని రామానాయుడు చెప్పుకున్నారు. 6 కేంద్రాల్లో ‘సెక్రటరీ’ వంద రోజులు పూర్తిచేసుకుంది. ‘‘చదవడానికి బాగున్న ‘సెక్రటరీ’లో బాక్సాఫీస్ సూత్రాలు తక్కువ’’ అంటూ, ‘‘ఈ నవలను సిన్మా తీయడం తేలికైన పని కాదు’’ అని స్వయంగా అక్కినేనే శతదినోత్సవ వేదికపై విశ్లేషించారు. ఏమైనా, ‘సెక్రటరీ’ నవల, ఈ నవలా చిత్రం ఇన్నేళ్ళు గడిచినా ఆ తరానికి ఓ తరVýæని పాత జ్ఞాపకాల పేటిక!
‘సారథీ’తో ‘దేవదాసు’ వివాదం
‘సెక్రటరీ’కి ముందు అక్కినేనికి పెద్ద ఇబ్బంది ఎదురైంది. నవయుగ ఫిలిమ్స్ వారు అక్కినేనికి సన్నిహితులు. నవయుగ వారి సోదర పంపిణీ సంస్థ ‘శ్రీఫిలిమ్స్’లో అక్కినేని భాగస్వామి! హైదరాబాద్ షిఫ్టయి, ఇక్కడే సినిమాలు చేస్తానంటున్న తమ హీరో అక్కినేని కోసం నవయుగ వారు నష్టాల్లో ఉన్న సారథీ స్టూడియోను లీజుకు తీసుకొని నడుపుతున్నారు. 1971 ప్రాంతంలో అక్కినేని ‘అన్నపూర్ణా ఫిల్మ్స్’ అని సొంతంగా డిస్ట్రిబ్యూషన్ పెట్టారు. కాగా, 1974లో శ్రీఫిలిమ్స్ ఆర్థిక సహకారంతో హీరో కృష్ణ కలర్లో ‘దేవదాసు’ తీయడం సంచలనమైంది.
అమెరికాకు వెళ్ళే ఆరు నెలల ముందు అక్కినేని తన పాత ‘దేవదాసు’ హక్కులు కొన్నారు. కృష్ణ ‘దేవదాసు’(1974 డిసెంబర్ 6)కు పోటీగా వారం ముందు ఈ పాతది రిలీజ్ చేయించారు. కృష్ణ ‘దేవదాసు’కు డబ్బులు పెట్టిన తాము నష్టపోతామని నవయుగ వారు వారించినా, అక్కినేని వినలేదు. ఆ పోటీలో కృష్ణ ‘దేవదాసు’ ఫ్లాపైంది. దాంతో, మనసుకు కష్టం కలిగిన నవయుగ వారు ఆ డిసెంబర్ 10న అమెరికా నుంచి వచ్చాక అక్కినేని ‘క్షేత్రయ్య’ షూటింగ్‌కు సారథీ స్టూడియో ఇవ్వడం ఆపేశారు. ‘నష్టాల వల్ల స్టూడియో మూసేశాం’ అన్నారు. ఇక, తప్పక అక్కినేని అన్నపూర్ణా స్టూడియోస్ కట్టుకోవాల్సి వచ్చింది.
ఆ జంట... సూపర్ హిట్!
అది వాణిశ్రీ హవా సాగుతున్న కాలం. ఆమె కట్టిందే చీరగా, పెట్టిందే బొట్టుగా, చుట్టిందే కొప్పుగా జనం నీరాజనం పడుతున్న సమయం. 1970ల మొదట్నించి ఏడెనిమిదేళ్ళు ఏ సినిమా చూసినా వాణిశ్రీయే! ఏయన్నార్‌తో ‘సెక్రటరీ’ నాటికి ఎన్టీఆర్ (‘ఆరాధన’), కృష్ణ (‘చీకటి వెలుగులు’), శోభన్‌బాబు (‘ప్రేమబంధం’), కృష్ణంరాజు (‘భక్త కన్నప్ప’) – ఇలా పేరున్న ప్రతి హీరో పక్కనా ఆమే! ఆ ఊపులో వచ్చిన ‘సెక్రటరీ’, ఆమె జయంతి పాత్ర జనంలో బోలెడంత ఆసక్తి రేపాయి. శతదినోత్సవ చిత్రం చేశాయి.
అక్కినేని – వాణిశ్రీలది అప్పుడు హిట్ పెయిర్. కలర్ సినిమాల శకం ప్రారంభమైన 1971 నుంచి 1976లో ‘సెక్రటరీ’ దాకా ఆ కాంబినేషన్లో ఫెయిల్యూర్ సిన్మా లేదు. ఆ ఆరేళ్ళలో తెలుగు సినీ రాజధాని విజయవాడలో రిలీజైన హాలులోనే వంద రోజులాడిన అక్కినేని 8 చిత్రాల్లోనూ వాణిశ్రీయే హీరోయిన్ (1971 – దసరాబుల్లోడు, పవిత్రబంధం, ప్రేమనగర్. 1972 – విచిత్ర బంధం, కొడుకు – కోడలు. 1973 – బంగారుబాబు. 1974 – మంచివాడు. 1976 – సెక్రటరీ).
ఇక అదే కాలంలో వచ్చిన తొమ్మిదో చిత్రం ‘దత్తపుత్రుడు’ (1972) కూడా ఎబౌ ఏవరేజ్‌గా నిలిచి, షిఫ్టులతో శతదినోత్సవం చేసుకోవడం విశేషం. అదే సమయంలో ఇతర హీరోలతోనూ వాణిశ్రీకి మరో ఆరేడు శతదినోత్సవ విజయాలుండడం గమనార్హం. అలా ఆమె ఆ కాలంలో తన ఆధిక్యాన్ని చాటుకున్నారు. చివరకు సాక్షాత్తూ అక్కినేని సైతం, ‘‘ఈ ‘సెక్రటరీ’లో నేను నటించకపోయినా ఫరవాలేదు కానీ, వాణిశ్రీ లేకపోతే చిత్రం విజయవంతం కాదనే నమ్మకం నాకు కలిగింది’’ అని శతదినోత్సవ వేదికపై బాహాటంగా ఒప్పుకోవడం మరీ విశేషం.
అన్నపూర్ణా స్టూడియోస్... అలా కట్టారు!
‘‘నాకు నటించడానికి హైదరాబాద్‌లో చోటు లేదని తెలిశాక... నేను విపరీతంగా మానసిక సంఘర్షణను ఎదుర్కొంది అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మాణానికి ముందు’’ అని అక్కినేని అప్పట్లో తన మానసికస్థితిని వివరించారు. మనుమడు – నేటి హీరో చిన్నారి సుమంత్, పెద్ద కుమారుడు వెంకట్ చేతుల మీదుగా 1975 ఆగస్టు 13 ఉదయం అన్నపూర్ణా స్టూడియోస్‌కు శంకుస్థాపన చేయించారు అక్కినేని. ప్రభుత్వమిచ్చిన 15 ఎకరాల స్థలంలో... కొండలను పిండి కొట్టి, బండరాళ్ళను పగలగొట్టి, ఎంతో కష్టం మీద స్టూడియో నిర్మాణం సాగించారు.
ఒకపక్క ‘క్షేత్రయ్య’ కోసం తరచూ బెంగుళూరు వెళ్ళి వస్తూ, మరోపక్క ఈ నిర్మాణం పనుల్లో తలమునకలయ్యారు. ‘‘ఇంజనీర్లు లేరు. బండరాళ్ళు కొట్టించడం దగ్గర నుంచి డిజైన్లు, ఇతర ప్లాన్లు వేసుకోవడం వరకూ అన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది’’ అని అక్కినేని ఓసారి చెప్పారు. అంతకు ముందు ‘అక్కినేని 60 సినిమాల పండుగ’కు సొంత ఖర్చుతో మద్రాసులో ‘విజయా గార్డె¯Œ ్స’ సిద్ధం చేసిన నిర్మాత బి. నాగిరెడ్డి ఈసారి హైదరాబాద్ లో స్టూడియో నిర్మాణంలోనూ సలహాలు, సూచనలిచ్చారు. మద్రాసు నుంచి ప్రత్యేకంగా పనివాళ్ళను పంపించారు.
∙అన్నపూర్ణా స్టూడియోస్
తొలి నవలే... సెన్సేషన్
యద్దనపూడి తొలి నవలే ‘సెక్రటరీ’. అప్పట్లో విజయవాడ నుంచి ‘జ్యోతి’ మంత్లీ రాఘవయ్య ప్రారంభించారు. ఆ పత్రిక నడిపిన బాపు – రమణలు కోరగా యద్దనపూడి రాసిన నవల ఇది. అనంతర కాలంలో ‘నవలా రాణి’గా పేరు తెచ్చుకున్న యద్దనపూడి, నిజానికి ‘‘వాళ్ళు అడిగినప్పుడు, నేను కథలే రాశా. నవల రాయడం తెలీదు. ఎప్పుడూ రాయలేదన్నా’’రు. కానీ బాపు – రమణ, ‘‘మీరు రాయగలరు. మరేం లేదు... పెద్ద కథ రాసేయండి’’ అని భరోసా ఇచ్చారు. నవల పేరేమి వేద్దామంటే, అప్పటికప్పుడు యద్దనపూడి ఇంట్లోని తనకిష్టమైన సరస్వతీదేవి బొమ్మ దగ్గర తెల్లకాగితంపై ‘సెక్రటరీ – రచన యద్దనపూడి సులోచనారాణి’ అని రాసిచ్చారు.
ఆమె నవలా హీరో
చిత్రనిర్మాణవేళలోనే ‘సెక్రటరీ’కి బోలెడంత క్రేజు రావడానికి కారణం నవల. ‘సెక్రటరీ’ మంత్లీ సీరియల్ వచ్చిన రోజుల్లోకి వెళితే... తెలుగులో పాపులర్ సాహిత్యాన్ని మహిళలు ఏలడం మొదలైన కాలమది. లత, రంగనాయకమ్మ, కోడూరి కౌసల్యాదేవి లాంటి పాపులర్ రచయిత్రుల వెనుక వచ్చి, రేసులో వారిని దాటి దూసుకుపోయిన పేరు యద్దనపూడి. కన్నెవయసులో బందరులో ‘తోడికోడళ్ళు’ సినిమా చూసి, హీరో అక్కినేనిని కలల నిండా నింపుకొన్న యద్దనపూడి, తాను సృష్టించిన కలల లోకపు నవలలకు అదే అక్కినేని కథానాయకుడై ప్రాణం పోస్తాడని ఊహించలేదు. అక్కినేని నటించిన ‘ఆత్మీయులు’, ‘విచిత్ర బంధం’, ‘బంగారు కలలు’, ‘సెక్రటరీ’ చిత్రాలు యద్దనపూడి నవలలే!
– రెంటాల జయదేవ