టూకీగా ప్రపంచ చరిత్ర -108
వేకువ
క్షత్రియ వర్ణ ప్రవేశంతో నగరపాలికులకు పునాది ఏర్పడింది. ఒక ప్రధాన పట్టణం, దాని చుట్టుపక్కలున్న వ్యవసాయ గ్రామాలూ ఆ రాజ్యాల ఎల్లలు. ఆ పరిధిలోని భూమి సర్వస్వానికీ యజమాని రాజు. రైతులు కౌలుదార్లు మాత్రమే. మెచ్చినవారికి ఆ పొలంలో కొంతమేర రాజు దానంగా ఇవ్వవచ్చు. అలాంటి సందర్భాల్లో కౌలుదారునికి యజమాని మారుతాడు. ఆటవిక తెగలమీద క్షత్రియుల పెత్తనం ఉండేది గాదని పురాణగాథల ద్వారా తెలుస్తూంది. మహాభారతంలోని అరణ్యపర్వం ఆధారంగా, అడవులేవీ రాజులు ఏలుబడిలో ఉండేవిగాదని స్పష్టంగా అర్థమౌతుంది.
పాలన ఏర్పడింది మొదలు క్షత్రియుల నడవడిక బ్రాహ్మణవర్గం కనుసన్నల్లో సాగింది. ఐతే, నిరంతరం ఈ ఆధిపత్యం సజావుగా సాగలేదని సూచించే వృత్తాంతాలు పురాణాల్లోనే కనిపిస్తాయి. అసురులను పక్కనబెడితే, మానవుల్లో బ్రాహ్మణుల పెత్తనాన్ని మొదటిసారిగా ధిక్కరించిన క్షత్రియుడు కార్తవ్యార్జునుడు. అందుకు గుణపాఠంగా, అతనితో పాటు క్షత్రియ వంశాన్నే నాశనం చేసినవాడు పరశురాముడు. రెండవ తిరుగుబాటుకు కారకుడు వేణచక్రవర్తి. బ్రాహ్మణుల ప్రోత్సాహంతో అతని కుమారుడైన పృథు తండ్రిని హత్యజేసి షట్చక్రవర్తుల్లో స్థానం సంపాదించుకున్నాడు.
క్రీ.పూ.10వ శతాబ్ద కాలంలో ఆర్యావర్తం రాజ్యాలు తొలిదశ నైలు నాగరికతలో ఏర్పడిన చిన్న చిన్న ఏలుబడుల వంటివి. అక్కడిలాగే ఇక్కడ కూడా ఇరుగుపొరుగు రాజ్యాల పురోహితులతో లాలూచీపడి క్రమంగా విస్తరించడం మొదలెట్టాయి. యుద్ధాలకు అవసరమైన గుర్రాలనూ, ఆయుధాలనూ పర్షియన్ల నుండి కొనుగోలు చేసేందుకు నేటి పెషావర్ (సంస్కృత సాహిత్యంలోని పురుష పురం) వాణిజ్య కూడలిగానూ, దాని సమీపంలోని ‘తక్షశిల’ ఆర్యావర్తం, పారసీకం, మెసొపొటేమియా, ఈజిప్టులకు సాంస్కృతిక కేంద్రంగా ఏర్పడింది.
ఉత్తరావర్తంలో అనేకచోట్ల ముడిఖనిజం నిక్షేపాలు దొరకడంతో, లోహ పరిశ్రమలో స్థానిక నైపుణ్యం విరివిగా ప్రవేశించింది. ఇలాంటి వాతావరణంలో, క్రీ.పూ. 6 శతాబ్దంలో కయ్యాలతోనూ, వియ్యాలతోనూ పరిధులు విస్తరించుకుంటూ సామ్రాజ్యంగా ఏర్పడిన మగధకు బింబిసారుడు (క్రీ.పూ.543-491) చక్రవర్తి. ‘రాజగృహ’ పట్టణం అతని రాజధాని. అదే సమయంలో పశ్చిమాసియా మొత్తాన్ని సైరస్ ది గ్రేట్ పాలిస్తున్నాడు. బింబిసార చక్రవర్తికి సమకాలీనుడు సిద్దార్థ గౌతముడు (క్రీ.పూ.563-483). చక్రవర్తి కంటే వయసులో ఐదేళ్లు పెద్దవాడు.
తోటి జనులతో చనువుగా మెలగిన సిద్దార్థుడు రోగపీడితుల యాతన చూశాడు, సత్తువ కోల్పోయిన వృద్ధుల ఆవేదన గమనించాడు. చావుమంచం ఎక్కినవాళ్లు బతికేందుకు పడే తాపత్రయం అవగాహన చేసుకున్నాడు. పేదరికం, అమాయకత్వం, మూఢవిశ్వాసం, పిసినారితనం వంటి మానసిక బలహీనతలతో పాటు, దొంగతనం, జూదం, అసూయ, రాగద్వేషాల వంటి అవలక్షణాలను గుర్తించాడు. అతని మనసు వాటి పరిష్కారానికి తహతహలాడింది. అతని ఆలోచన అందుకు మార్గాలు వెదికే ధ్యాసలో కూరుకుపోయింది.
పెళ్లి, దాంపత్య సుఖాలు అతన్ని ఆ ఆలోచన నుండి విరమింపజేసేందుకు విఫలమయ్యాయి. ఒక తాగుబోతుకు భార్యమీది కంటే మద్యం మీద ఆసక్తి ఎక్కువుండే చందంగా, ఒక జిజ్ఞాసాపరునికి తన అన్వేషణే ప్రాణప్రదం.
బ్రాహ్మణులు చెప్పే శాస్త్రాల్లో సమాధానాలు దొరకగలవనే ఆశతో అతడు వాటిని నేర్చుకునేందుకు ప్రయత్నించాడు. అవి బ్రాహ్మణుల గుప్త సంపదగా మారిపోయి ఉన్నాయి.
యోగులుగా దేశాలు పట్టుకు తిరిగే సన్యాసులను ఆశ్రయించాడు. దగ్గరగా చూసిన తరువాత వాళ్లు బూటకమని తేల్చుకున్నాడు. గంగానదికి ఆవలిగావున్న రుష్యాశ్రమాల్లో తన దాహం తీరవచ్చుననే నమ్మకంతో కుటుంబాన్ని వదిలేసి, ‘రాజగృహ’ దిశగా బయలుదేరాడు. బయలుదేరే సమయానికి యశోదర కొడుకును ప్రసవించింది. పుత్ర వాత్సల్యమనే మోహపాశమైనా సిద్దార్థుని ప్రయత్నాన్ని ఆపలేకపోయింది.
ఆశ్రమవాసంలో సిద్దార్థుడు ఏళ్ల తరబడి తనకు కావలసిన సమాధానాల కోసం ఎదురుచూశాడు. ఒకచోట తృప్తి దొరకక, మరొక చోటికి తరలిపోయాడు. వెళ్లిన ప్రతిచోట అతనిలోని విధేయత ఆశ్రవాసుల ఆప్యాయతను పొందగలిగింది. ధ్యానంతో జ్ఞానం కలుగుతుందని అతడు వాళ్ల నుండి నేర్చుకున్నాడు. ఆ జ్ఞానానికి పర్యవసానం ఏమిటి అనే ప్రశ్న అతనిలో ఉదయించింది. ప్రతిఫలంగా దొరికే మోక్షం జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందనే రుషుల నిర్వచనం సిద్దార్థునికి నచ్చలేదు. మోక్షమనేది వ్యక్తికి ఒనగూరే లాభం. కనీసం పక్కమనిషితోనైనా పంచుకునేందుకు వీలుపడనిది. అందువల్ల, మోక్షసాధన అనేది స్వార్ధానికి పరాకాష్టంగా అతనికి తోచింది. సిద్దార్థుడు కోరుకునేది పదుగురితో పంచుకునేందుకు వీలయ్యే జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని స్వయంగా సంపాదించుకునేందుకు సిద్దార్థుడు నిర్ణయించుకున్నాడు.
ఆశ్రమాన్ని వదిలి, సొంత ప్రయత్నం మీద బయలుదేరిన సిద్దార్థునికి తనలాగే ఆశ్రమాలతో విసిగిన ఐదుగురు మిత్రులు తోడైనారు. ఆహారం మానివేసి, అన్నో ఇన్నో ఆకులలుములు తింటూ, నిశ్చలమైన ఏకాంతంలో కూర్చుని తపస్సులో మునిగితే జ్ఞానం సంప్రాప్తిస్తుందని అందరూ కలిసి నిర్ణయించుకున్నాడు. వింధ్య పర్వత ప్రాంతంలోని ఒక కొండగుహను ఎన్నుకుని సిద్దార్థుడు తపస్సులో కూర్చున్నాడు. మిత్రులు అతని గొప్పతనాన్ని చుట్టుపక్కల గ్రామాల్లో పెద్దగా ప్రచారం చేస్తున్నారు.
కొన్ని రోజులకు సిద్దార్థుని శరీర బలం పూర్తిగా నీరసించిందేగానీ జ్ఞానం జాడ దొరకలేదు. ఇది సరైన మార్గమేనా అనే సంశయంతో ఆలోచించుకుంటూ నదివొడ్డున పచార్లు చేస్తున్న సిద్దార్థుడు స్పృహ తప్పి నీటిలో పడిపోయాడు. మిత్రుల సహాయంతో బయటపడి కోలుకున్న తరువాత అతడు ఆహారం కావాలని కోరడం మిత్రలను కలవరపెట్టింది. మెదడుకు శక్తి ఉంటేనే జ్ఞానాన్ని సంపాదించగలుగుతుంది గానీ, నీరసంతో అది అసాధ్యం అనే పలుకులు వాళ్లకు ములుకులైనాయి. సిద్దార్థునికి భ్రష్టత్వం ఆపాదించి వాళ్లు తమ దారిని వెదుక్కున్నారు.
ఒంటరిగా మిగిలిన సిద్దార్థుని పరిస్థితి గమనించిన పశుకాపరి వనిత సుజాత, కొన్ని పాలు, కొద్ది కొద్ది భోజనంతో అతన్ని ఆరోగ్యవంతుణ్ని చేసింది. తేరుకున్న సిద్దార్థుడు నదివొడ్డున్నే ఉన్న రావిచెట్టు నీడలో కూర్చుని, నెలల పర్యంతం తనలో తాను తర్కించుకోవడం మొదలెట్టాడు. మెదడును కమ్ముకున్న మబ్బులు కొద్దికొద్దిగా విచ్చిపోవడం ప్రారంభించాయి. కొంతకాలానికి జ్ఞానోదయమైన సంతృప్తితో బుద్ధుడైన సిద్దార్థుడు సంచారానికి బయలుదేరాడు. ఇంతకాలం అతడు ఏ నీడన జ్ఞానం సంపాదించాడో ఆ రావిచెట్టు ‘బోధివృక్షం’ అయింది. నేటి బీహార్ రాష్ట్రంలోని ‘గయ’ పట్టణానికి సమీపంలో ఉండే బౌద్ధుల పుణ్యక్షేత్రమే ఆ బోధివృక్షం.
బయలుదేరిన సిద్దార్థుడు కాలినడకన ‘వారణాసి’ చేరుకున్నాడు. అక్కడ అతనికి తనను విడిచిపెట్టివెళ్లిన ఐదుగురు మిత్రులూ కనిపించారు. వాళ్లింకా సన్యాస జీవితమే గడుపుతున్నారు. సిద్దార్థుని కళ్లల్లో ప్రజ్వరిల్లుతున్న ఆత్మవిశ్వాసం వాళ్లను ఆశ్చర్యచకితులను చేసింది. సిద్దార్థుడు పొందిన జ్ఞాన రహస్యం తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. ఐదురోజుల పాటు వాళ్ల మధ్య చర్చోపచర్చలు ఏకధాటిగా కొనసాగాయి. సిద్దార్థుని అభిప్రాయాలతో వాళ్లకు సంపూర్ణమైన ఏకీభావం కుదిరింది.
సిద్దార్థుణ్ని వాళ్లు బుద్ధునిగా గుర్తించారు. అందరూ కలిసి వారణాసి సమీపంలోని జింకల వనంలో కుటీరం నిర్మించుకున్నారు. అనుయాయుల సంఖ్య క్రమక్రమంగా పెరిగింది. వర్షాకాలంలో మాత్రమే వాళ్లకు ఆశ్రమవాసం. మిగతా రోజుల్లో బుద్ధునితో సహా ప్రతి ఒక్కరు దిక్కుదిక్కున సంచారం చేస్తూ, జ్ఞానసందేశం ప్రజలకు అందించాలి. ప్రజలు పెట్టింది మాత్రమే తింటూ ప్రాణం నిలుపుకోవడం ఆ భిక్షకుల క్రమశిక్షణ.
పేదరికం, అమాయకత్వం, మూఢవిశ్వాసం, పిసినారితనం వంటి మానసిక బలహీనతలతో పాటు, దొంగతనం, జూదం, అసూయ, రాగద్వేషాల వంటి అవలక్షణాలను గుర్తించాడు.
బుద్ధుని బోధనల సర్వస్వం వివరంగా చర్చించేందుకు ఇక్కడ వీలుపడదు గాబట్టి, కీలకమైన అంశాలకు మాత్రమే మనం పరిమితమౌదాం. అతని బోధనలు స్పష్టమైనవిగాను, అర్థం చేసుకునేందుకు తేలికైనవిగాను ఉండటమే కాక, అత్యాధునిక భావాలకు బహుదగ్గరగా ఉండటం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. లోకంలోని బాధలన్నింటికీ మూలం స్వార్థచింతన; మానవుని అంతరంగానికి ‘దురాశ’ అనేది అంతులేని యాతనకు గురిచేస్తుందనేది బుద్ధుని తాత్వికచింతనకు పునాది.
అందువల్ల, వదులుకోవలసినవాటిలో మొదటిది - ఇంద్రియాలను తృప్తిపరచాలనే కోరిక; రెండవది - కీర్తి, సంపదలను ఆర్జించాలనే ఆశ; మూడవది - చిరంజీవిగా ఉండాలనే తాపత్రయం. మనిషి ఆలోచనా ప్రపంచం నుండి ‘నేను’ (అహం) అనే సర్వనామం తొలగించుకుంటే, మహోన్నతమైన జ్ఞానానికి దారి ఏర్పడుతుంది. ‘నిర్వాణం’ అంటే ప్రాణాలను త్యజించడం కాదు, ‘అహం’ అనే భావాన్ని త్యజించడం.
ఈ లక్ష్యాల సాధన కోసం తప్పనిసరిగా పాటించవలసిన క్రమశిక్షణగా ఎనిమిది నియమాలనూ గౌతమబుద్ధుడు నిర్దేశించాడు. వాటిల్లో మొదటిది మాటలో నిజాయితి; రెండవది నడవడికలో నిజాయితి; మూడవది బతుకు తెరువులో నిజాయితి; నాలుగవది వాంఛలో పరిశుద్ధత; ఐదవది సరైన దృక్పథం; ఆరవది ప్రయత్నంలో నిజాయితి; ఏడవది ఉద్రేకాల నిగ్రహం; ఎనిమిదవది ఆత్మపరిశీలనలో నిజాయితి. ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసింది కోరికలు చంపుకోవాలని కాదు బుద్ధుడు చెప్పింది; వాటిని సరైన మార్గానికి మరలించమని. కోరికలు చంపుకోగలిగినవి కావు; అవి చచ్చిపోతే మనిషికి బతుకు మీద ఆశే చచ్చిపోతుంది. పైగా, కోరికలను వదులుకోవడం ఆచరణ సాధ్యం కాని ప్రయత్నం.
అందువల్ల, కోరికలను సరైన మార్గంలో నడిపేందుకు ప్రతిమనిషి సరైన దృక్పథం ఏర్పరుచుకోవాలి. ఉదాహరణకు సమాజానికి సేవ చేయడం, న్యాయం నిలబెట్టేందుకు పాటుపడటం. కళల పట్ల ఆసక్తి వంటివి పెంపొందించుకోవాలని ఉద్దేశం. ప్రయత్నంలో నిజాయితి అంటే - పనేమో మంచిదే, కానీ దాన్ని సాధించేందుకు అవలంబించిన మార్గం నీచమైనదై, ఫలితాన్ని బట్టి మార్గాన్ని సమర్థించుకోవడం తగదని ఉద్దేశం. ఉద్రేకాలనేవి జీవికి సహజ లక్షణం. వాటిని అదుపులో పెట్టుకోగలిగినప్పుడే పశుత్వం వదలిన మనిషౌతాడు.
అందువల్ల, ఉద్రేకాలను నియంత్రించడమే కాదు, ఆ దశ నిరంతరం కొనసాగాలంటే మనం చేసుకునే ఆత్మపరిశీలనలో నిజాయితీ ఉంటేనే సాధ్యం అనేది వాటి సారాంశం ఈ బోధనలకు తోడు బుద్ధుడు పునర్జన్మల వంటి విశ్వాసాలను ఖండించాడు. బుద్ధుని ప్రచారాలు వైదికులకు వ్యతిరేకంగా ఉద్దేశించినవి కాకపోయినా, ఆ కోవకు చెందినవాళ్లకు అవి కంటగింపు కలిగించినా, ప్రజాబాహుళ్యాన్ని ఆ తత్వం ఆకర్షించింది. జీవితాంతం ఆదరాభిమానాలు చూరగొన్న తాత్వికునిగా తన 80వ ఏట గౌతమబుద్ధుడు ‘కుశినర (నేటి ఉత్తరప్రదేశ్లోని కుశినగర్)’లో జీవిత ప్రస్థానం ముగించాడు.
సిద్దార్థునికి జ్ఞానోదయమైన బోధివృక్షం ఇప్పటి గయలో కనిపించేది కాకపోయినా, అసలు వృక్షం తాలూకు అంటు సింహళంలో బహు జాగ్రత్తగా పోషింపబడుతూ, ప్రపంచంలోని అతి ప్రాచీనమైన చారిత్రిక వృక్షంగా ఈనాటికీ మిగిలే ఉంది. బోధివృక్షాన్ని కాపాడుకున్నంత జాగ్రత్తగా బుద్ధుని బోధనలను కాపాడుకోవడంలో అతని శిష్యులు విఫలమైనారు. ‘అహం’ను త్యజించడం సమాజాన్ని త్యజించినంత తేలిక కాదు. సంసారాలను విడిచిపెట్టడం వరకే చేయగలిగారు కానీ, ‘అహం’ను వదిలించుకోలేదు. తరాలు గడిచిన తరువాతి బౌద్ధబిక్షువులు రాజుల అనుగ్రహంతో, శిల్పంతో తీర్చిదిద్దిన ఆరామాల్లో సుఖమైన జీవితాలకు అలవాటుపడ్డారు.
సిద్దార్థునికి రెండు తరాల తరువాత గానీ భారతదేశంలో లిపి పుట్టిందిగాదు. అందువల్ల, అతని బోధనలను శిష్యులు ఎంతమేరకు అందుకోగలిగారో, ఎంతమేరకు తరువాతి తరాలకు అందించగలిగారో అంచనా వెయ్యడం సాధ్యమయ్యేదిగాదు. పోనుపోను సిద్ధాంతంలో మలినం పేరుకుపోయి, దిశానిర్దేశం లేనిదిగా తయారైంది. ఇటీవలి కాలంలో వెలుగుజూసిన అత్యంత పురాతనమైన పాళీగ్రంథాల మూలంగా మూలతత్వం కొంతమేరకైనా ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాం.