ku univeristy
-
విద్యార్థిని చితకబాదిన ఇతర విద్యార్థులు! అసలు కారణమేంటి..?
వరంగల్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్‌సైన్స్ కళాశాలలో శనివారం సాయంత్రం విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. బీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు.. బీఏ ద్వితీయ ,ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఆ కళాశాలలో ఆడిటోరియంలో వెల్కమ్ పార్టీ నిర్వహించారు. మధ్యాహ్నం 3గంటల వరకు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ తరువాత చాలా మంది విద్యార్థులు కళాశాల ఆవరణకు చేరుకున్నారు. కొందరు ఫొటోలు దిగుతున్నారు. ఈ సమయంలో ఏమైందో తెలియదుగాని ఓ ఫస్టియర్ విద్యార్థిని ద్వితీయ సంవత్సరం విద్యార్థులుగా భావిస్తున్న కొందరు చితకబాదారని సమాచారం. ఆ విద్యార్థిని వెంబడించి మరి చితకబాదారని తెలుస్తోంది. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న పలువురు అధ్యాపకులు ఘటనాస్థలికి చేరుకుని ఈ గొడవను నిలువరించారని సమాచారం. అనంతరం విద్యార్థులను కళాశాల నుంచి బయటికి పంపారు. కాగా, విద్యార్థిని ఎందుకు చితకబాదారనే విషయం తెలియరాలేదు. ఈ గొడవ విషయంపై ఆ కళాశాల ప్రిన్సిపాల్ బన్న ఐలయ్య దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. గొడవ పడిన విద్యార్థులను ఈనెల 8న లేదా 9న పిలిపించి మాట్లాడాలని యోచిస్తున్నారని సమాచారం. దీనిపై ప్రిన్సిపాల్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. -
పీజీ రెండవ దశ సీట్ల కేటాయింపు
కమాన్‌చౌరస్తా : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో పీజీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు రెండవ దశ సీట్లను కేటాయించడం శనివారం జరిగిందని కాకతీయ యూనివర్సీటీ ప్రవేశాల విభాగం అధికారులు డాక్టర్ వెంకయ్య, లక్ష్మీనాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీటు పొందిన విద్యార్థులు కోర్సు, సై ్లడింగ్ ఫీజును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చలాన ద్వారా కానీ, నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చని సూచించారు. సీటు అలాట్మెంట్ను డౌన్లోడ్ చేసుకొని సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయాలని లేనిచో ప్రవేశాలు రద్దవుతాయని వెల్లడించారు. ప్రత్యేక విభాగాలు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఇతర విభాగాలకు సర్టిపికేట్ల పరిశీలన, సీట్ల కేటాయింపు ఈ నెల 8న కాకతీయ ప్రవేశాల విభాగంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతందని తెలిపారు. చివరి దశ సీట్లను ఈనెల 9న కేటాయిస్తామని తెలిపారు. వెబ్ ఆప్షన్లు 9 నుంచి 11 తేది వరకు ఉంటాయని పేర్కొన్నారు. తుది దశలో సీటు పొందిన విద్యార్థులు తప్పనిసరిగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు తీసుకోవాలని లేనిచో వారి అడ్మిషన్లు రద్దు అవుతాయని సూచించారు.