‘కూడంకుళం’లో విద్యుదుత్పత్తి ప్రారంభం
సాక్షి, చెన్నై/కొలంబో: వివాదాస్పదమైన కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు తొలి యూనిట్ నుంచి ఎట్టకేలకు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఉన్న ఈ ప్లాంటులో మంగళవారం అర్ధరాత్రి 2.45 గంటల సమయంలో తొలుత 75 మెగావాట్లు, అనంతరం 160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయిందని ప్లాంట్ డెరైక్టర్ ఆర్.ఎస్.సుందర్ వెల్లడించారు. దీనిని దక్షిణాది గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్టు తెలిపారు. భారత్, రష్యాలు సంయుక్తంగా నెలకొల్పిన ఈ కేంద్రం నుంచి ఒకటి రెండు రోజుల్లో 300 మెగావాట్లు, దశల వారీగా 500, 750, 1,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరగనుందని సుందర్ వివరించారు.
నిజానికి నేషనల్ పవర్ కార్పొరేషన్ అంచనాల ప్రకారం ఈ ఏడాది ఆగస్టు చివరి వారానికే తొలి ప్లాంటును దక్షిణాది గ్రిడ్‌కు అనుసంధానం చేసి, 400 మెగా వాట్ల విద్యుదుత్పత్తిని ప్రారంభించాల్సి ఉంది. అయితే, ప్లాంటులో ఏర్పడ్డ సాంకేతిక లోపంతో ఉత్పత్తిలో జాప్యం జరిగింది. కాగా, ప్లాంటు నుంచి వెలువడే రేడియేషన్ వల్ల ఫుకుషిమా తరహా ముప్పు పొంచి ఉంటుందని శ్రీలంక ఆందోళన వ్యక్తంచేసింది. రష్యాని మెప్పించేందుకే కమిషన్ ఈ డ్రామాలాడుతోందని కూడంకుళం వ్యతిరేక ఉద్యమ నేత సుందరరాజన్ దుయ్యబట్టారు.