వణుకు పుట్టిస్తున్న ఫ్లయింగ్ స్నేక్..!
జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా కుంహారియా పంచాయతీ ప్రజలను ఓ మిస్టరీ పాము భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ ఎగిరే పాము (ఫ్లయింగ్ స్నేక్) చాలామందిని కాటేసిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ పాము కాటువల్ల ఓ వ్యక్తి మరణించాడని, దాదాపు 25 మంది అనారోగ్యంపాలయ్యారని కుంహారియా ప్రజలు తెలిపారు. ఈ పాము తొలుత అన్నదమ్ములను కాటేసిందని, తర్వాత చాలామంది దీనిబారిన పడ్డారని చెప్పారు. కాగా ఈ పుకార్ల వల్ల ఈ ప్రాంతంలో ఉన్న తాంత్రికులు వైద్యం పేరుతో స్థానికుల నుంచి డబ్బు గుంజుతున్నారు. డాక్టర్ల వల్ల ప్రయోజనం ఉండదని, తాము నయం చేస్తామని చెబుతూ ప్రజలను దోపిడీ చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎగిరే పాము చాలామందిని కాటేసిందని స్థానికులు చెబుతున్నా.. ఒక్కరూ కూడా ఆ పామును చూడలేదు. శరీరంపై కాట్లు పడటంతో తమను పాము కరిచిందని నమ్ముతున్నారు. తాంత్రికులతో మంత్రచికిత్స చేయించుకున్న తర్వాత తమకు ఉపశమనం కలిగిందని బాధితులు భావిస్తున్నారు. ఓ తాంత్రికుడు మాట్లాడుతూ.. పాము లేదా వేరే విషకీటకం కాటేసి ఉండొవచ్చని, దీన్ని నయం చేస్తానని అన్నాడు. బాధితుల వీపుభాగంలో ఓ పళ్లెం ఉంచి, మంత్రాలు వేస్తారు. శరీరంలోంచి విషాన్ని లాగేసిన తర్వాత ఈ పళ్లెం పడిపోతుందట. ఇంతకీ ఎగిరే పాము ఉందా లేదా, మంత్రాలతో చికిత్స సాధ్యమేనా అన్నది మిస్టరీగా మారింది.