సీమలో దాహం..దాహం..!
* ప్రమాద ఘంటికలు
* వేసవిని తలపిస్తున్న తాగునీటి ఎద్దడి
* కనిష్ట స్థాయికి పడిపోయిన భూగర్భ జలమట్టం
* బోర్లు ఎండిపోయి నిరుపయోగంగానీటి పథకాలు..!
* 1,811 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న దుస్థితి
ఈ ఫోటో చూశారా..కుప్పం నియోజకవర్గంలో కుంజేగానూరుకు చెందిన మహిళలు బిందెడు నీళ్ల కోసం పడుతున్న కష్టాలు. రోజూ నాలుగు కి లోమీటర్ల దూరంలోకి వ్యవసాయ బోరు బావినుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఒక్క కుప్పం నియోజకవర్గంలో 250కి పైగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. సీమ వ్యాప్తంగా అధిక శాతం గ్రామాల్లో ఇదే దుస్థితి. మగవాళ్లు వ్యవసాయ పనులకు వెళితే, మహిళలు, పిల్లలు తాగునీటి కోసం మైళ్ల దూరం వెళుతున్నారు. దినమంతా వారు దీని కోసమే అష్టకష్టాలు పడుతున్నారు. నీటి ఎద్దడి ముంచుకొస్తున్నా అధికారులు మాత్రం ముందుస్తు ప్రణాళికలపై ఇంకా దృష్టిపెట్టడంలేదు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: దుర్భిక్ష సీమలో తాగునీటి ఎద్దడి అప్పుడే వేసవిని తలపిస్తోంది. వర్షాలులేక భూగర్భ జలమట్టం కనిష్ట స్థాయికి పడిపోయింది. బోర్లు ఎండిపోవడంతో రక్షిత నీటి పథకాలు దిష్టిబొమ్మల్లా మారాయి. ఇప్పటికే 1,811 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చిత్తూరు జిల్లాలో ఏకంగా 1,453 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇందులో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే 198 గ్రామాలు ఉన్నాయి.
వర్షాభావ ప్రాంతమైన రాయలసీమపై వరుణుడు మరో సారి పగబట్టాడు. సాధారణం కన్నా 43.5 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో సీమలో వరుసగా ఐదో ఏటా దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. చిత్తూరు జిల్లాలో 18.35 మీటర్లు, అనంతపురంలో 19.12 మీటర్లు, వైఎస్సార్ జిల్లాలో 18.32 మీటర్లు, కర్నూలు జిల్లాలో 16.85 మీటర్లకు భూగర్భ జలమట్టం పడిపోయింది. ప్రస్తుతం ప్రతి నెలా భూగర్భ జలమట్టం పడిపోతూ వస్తోంది. దీంతో వ్యవసాయ బోరు బావులతో పాటు రక్షిత మంచినీటి పథకాల బోర్లు కూడా ఎండిపోతున్నాయి. దాంతో బిందెడు నీళ్ల కోసం మైళ్ల దూరంలోని వ్యవసాయ బోరు బావులను ఆశ్రయిస్తున్నారు.
* చిత్తూరు జిల్లాలో 1,380 పంచాయతీల పరిధిలో 11,580 గ్రామాలు ఉన్నాయి. 40 వేలకుపైగా బోరు బావులు ఎండిపోయాయి. జిల్లాలో 1,453 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మరో 212 గ్రామాలకు వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకుని నీటిని సరఫరా చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఇలానే కొనసాగితే వేసవిలో మరో 1,700 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
* అనంతపురం జిల్లాలో 1,006 పంచాయతీల పరిధిలో 3,385 గ్రామాలు ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలమట్టం కనిష్ట స్థాయికి చేరడంతో 60 వేలకుపైగా బోరు బావులు ఎండిపోయాయి. ఇప్పటికే 288 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారానూ.. వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకుని తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
* వైఎస్సార్ జిల్లాలో 818 పంచాయతీల పరిధిలో 4,241 గ్రామాలు ఉన్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతోండటంతో ఇప్పటికే 35 వేలకుపైగా బోరు బావులు ఎండిపోయాయి. 180 గ్రామాలకు తాగునీటిని ట్యాంకర్ల ద్వారానూ.. మరో 92 గ్రామాలకు వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకుని సరఫరా చేస్తున్నారు.
* కర్నూలు జిల్లాలో 898 పంచాయతీల పరిధిలో 1,526 గ్రామాలు ఉన్నాయి. దుర్భిక్షం వల్ల భూగర్భ జలమట్టం పడిపోవడంతో 20 వేలకుపైగా బోరు బావులు ఎండిపోయాయి. ప్రస్తుతం 125 గ్రామాలకు తాగునీటిని ట్యాంకర్ల ద్వారానూ.. వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకుని సరఫరా చేస్తుండటం గమనార్హం.