Kuntala waterfall
-
TSRTC: సుందర జలపాతాలు చూసొద్దాం రండి..
సాక్షి, హైదరాబాద్: పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులకు శుభవార్త. జలపాతాల సందర్శనకు తెలంగాణ ఆర్టీసీ ప్రతి శని, ఆదివారాల్లో బస్సులు నడపాలని నిర్ణయించింది. ఆదిలాబాద్‌లోని కుంటాల జలపాతాన్ని సందర్శించేందుకు ఈ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈప్రత్యేక బస్సులు ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 5 గంటలకు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ప్లాట్‌ఫామ్ 55, 56) నుంచి, ఉదయం 5.30 గంటలకు జూబ్లీ బస్‌స్టేషన్ (ప్లాట్‌ఫామ్ 20) నుంచి బయల్దేరుతాయి. పర్యటనలో భాగంగా పోచంపాడ్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, పోచేరా జలపాతం సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆదిలాబాద్‌లోని కుంటాల జలపాతాన్ని, అనంతరం నిర్మల్ బొమ్మలు, హస్తకళలను సందర్శిస్తారు. రాత్రి 10.45 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటారు. (క్లిక్: ఆర్టీసీ ‘హైదరాబాద్ దర్శిని’.. వీకెండ్లో స్పెషల్ సర్వీసులు) ఈ పర్యటనలో కుంటాల వద్ద మధ్యాహ్న భోజనం, తిరుగు ప్రయాణంలో చేగుంట వద్ద రాత్రి భోజన సదుపాయం ఉంటుంది. పిల్లలకు రూ.599, పెద్దవాళ్లకు రూ.1099 చొప్పున చార్జి ఉంటుంది. పర్యటన టిక్కెట్ల బుకింగ్ కోసం ఫోన్ : 7382842582 నంబర్‌ను సంప్రదించవచ్చు. (క్లిక్: పెద్ద జబ్బులకు ఉచితంగా పీహెచ్‌సీల్లో చికిత్స) -
కుంటాల జలపాతం వద్ద అల్లు అర్జున్ సందడి
-
కుంటాల జలపాతంలో ఇద్దరు గల్లంతు
ఆదిలాబాద్: విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ వద్ద గల ప్రఖా్యత విహార ప్రదేశమైన కుంటాల జలపాతంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఫొటోలు దిగేందుకు నీటిలోకి దిగిన అన్సార్, ఫైజాన్ అనే 21 ఏళ్ల వయసున్న యువకులు కాలుజారి పడిపోయి గల్లంతయ్యారు. వీరు నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం ఆర్గుల్ గ్రామానికి చెందిన వారు. వీరు తమ గ్రామానికే చెందిన మరో ముగ్గురు మిత్రులతో కలిసి విహార యాత్రకు వచ్చారు. అన్సార్ బైక్ మెకానిక్ కాగా ఫైజాన్ విద్యుత్ సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మిగతా ముగ్గురు బీటెక్ చదువుతున్నారు. -
అక్కడ అలా.. ఇక్కడ ఇలా
మహారాష్ర్టలోని సహస్రకుండ్ జలపాతం వద్ద మంచి రక్షణ చర్యలు పెద్ద సంఖ్యలో వెళ్తున్న పర్యాటకులు కుంటాల వద్ద కనిపించని కనీస ఏర్పాట్లు పర్యాటకులకు పొంచి ఉన్న ప్రమాదం ఇప్పటికే అనేకమంది మృత్యువాత..! భైంసా : మహారాష్ట్రలోని నాందేడ్, యవత్మాల్ జిల్లాల సరిహద్దులో కిన్వట్తాలూకా పరిధిలో గల ఇస్లాపూర్‌లోని సహస్రకుండ్(సాసర్‌కుండ్) జలపాతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. అక్కడి ప్రభుత్వం ఈ జలపాతం వద్ద పర్యాటకుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రక్షణ ఏర్పాట్లు చేసింది. నిర్మల్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలోనే ఈ జలపాతం ఉంది. కిన్వట్, బోథ్ తాలూకాలు పక్కపక్కనే ఉంటాయి. అక్కడి సాసర్‌కుండ్ జలపాతానికి పర్యాటకులు పెరుగుతున్నారు. కాని పక్కనే ఉన్న మన జలపాతం వద్ద ఈ సంఖ్య కొంత తగ్గుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం పర్యాటకుల క్షేమం కోసం చేసిన ఏర్పాట్లు మెరుగ్గా ఉన్నాయి. కాని మన తెలంగాణలో అత్యంత ప్రాధాన్యం ఉన్న కుంటాల జలపాతంలో మాత్రం ఇప్పటికీ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. సినిమా షూటింగ్‌లైనా.. ఇప్పటికే బోథ్ నియోజకవర్గ పరిధిలో గల నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం వద్ద పెద్దపెద్ద సినిమాల షూటింగ్‌లు జరిగాయి. చిన్న సినిమాలు ఎన్నో తెరకెక్కించారు. ఇక్కడి జలపాతం దృశ్యాలు చూసేందుకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయినా ఇక్కడ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ జలపాతం అంతగా ప్రాధాన్యం లేకపోయిన తెలంగాణ టూరిజం ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడ అభివృద్ధి కోసం ఇప్పటికే టూరిజం బృందం పలుమార్లు పరిశీలించింది. అయినా ఇప్పటికీ ఎలాంటి పనులు చేపట్టలేదు. మహారాష్ట్రలోని సాసర్‌కుండ్ జలపాతానికిసైతం టూరిజం అధికారులు వెళ్లారు. అక్కడి ఏర్పాట్లు పరిశీలించారు. కుంటాలలో అత్యాధునిక టెక్నాలజీతో రోప్‌వే నిర్మాణం చేపడుతామని చెబుతున్నారు. కానీ పెద్ద సంఖ్యలో వెళ్లే సామాన్యుల కోసం సాసర్కుండ్లా సేఫ్టివాల్లు నిర్మించాలని పర్యాటకులు కోరుతున్నారు. కుంటాల వద్ద గతంలో ప్రమాదాల్లో అనేకమంది చనిపోయారు కూడా. అయినా వాటి నుంచి అధికారులు పాఠాలు నేర్వడం లేదు. అక్కడ అంతా సేఫ్టీ సాసర్కుండ్లో జలపాతానికి వెళ్లేందుకు పిల్లర్లు తవ్వి స్లాబు వేశారు. జలపాతం అందాలు వీక్షించేందుకు వీలుగా బండరాళ్లకు లోతుగా తవ్వి ఇనుప చువ్వలు బిగించారు. ఇనుప చువ్వల బయట నుంచి జలపాతం వీక్షించవచ్చు. టవర్‌లాగా వ్యూ పాయింట్ కూడా ఉండడంతో దాన్ని ఎక్కి జలపాతం అందాలన్ని పైనుంచి చూడవచ్చు. జలపాతం పురాణగాథ మహారాష్ట్రలోని మహోర్ పుణ్యక్షేత్రం సమీపంలోనే ఈజలపాతం ఉంది. పరుశరాముడు వేసిన బాణం వద్దే జలపాతం పుట్టిందని పురాణగాథలు చెబుతున్నాయి. మహోర్ వెళ్లే యాత్రికులంతా ఇక్కడికి వెళ్తుంటారు. ఈ పుణ్యభూమిలో ఎంతో మంది తపస్సు చేశారనికూడా చెబుతుంటారు. -
'కుంటాల'లో అన్నదమ్ముల మృతదేహాలు
నేరేడుగొండ (ఆదిలాబాద్) : ప్రకృతి అందాలకు నెలవైన కుంటాల జలపాతంలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు జలపాతంలో మృతదేహాలుగా తేలారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం కుంటాల జలపాతంలో సోమవారం జరిగింది. వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన సంతోష్(25), అంబాదాస్(22)లు ఇద్దరు అన్నదమ్ములు. కాగా వారిద్దరు కలిసి మూడు రోజుల కిందట బైక్ మీద కుంటాల జలపాతం వద్దకు వచ్చారు. అయితే అప్పటి నుంచి ద్విచక్రవాహనం అక్కడే ఉండటంతో సోమవారం కొంతమంది జాలర్లు జలపాతంలోకి వెళ్లి చూడగా... ఇద్దరు యువకుల మృతదేహాలు కనిపించాయి. వాటిని వెలికి తీసిన పోలీసులు సంతోష్, అంబాదాస్లుగా గుర్తించారు. వీరు కుంటాల జలపాతం అందాలు వీక్షించడానికి వెళ్లారా లేక ఆత్మహత్య చేసుకున్నారా.. లేక జారిపడి ప్రమాదవశాత్తు మృతి చెందారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
'కుంటాల'లో బీటెక్ విద్యార్థుల గల్లంతు
నేరేడుగొండ (ఆదిలాబాద్) : సెలవుల్లో స్నేహితులతోపాటు సరదాగా గడపడానికి షికారుకు వెళ్లిన పది మంది ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఇద్దరు ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి కొట్టుకుపోయారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలంలోని కుంటాల జలపాతంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన పదిమంది ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు విహారయాత్రలో భాగంగా కుంటాల జలపాతాన్ని సందర్శించడానికి వెళ్లారు. ఈ క్రమంలో నడుచుకుంటూ వెళ్తున్న స్నేహితుల్లో ఇద్దరు యువకులు జలపాతంలోని మొదటి గుండం వద్ద ప్రమాదవశాత్తూ కాలు జారి నీళ్లలో కొట్టుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి స్నేహితులు వారిని రక్షించేందుకు ప్రయత్నించేలోపే వాళ్లు గల్లంతయ్యారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా.. గల్లంతైన వారిలో ఒకరు గీతం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న అనిల్(21) గా, మరొకరు జేబీఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న రవి(20) గా గుర్తించారు. కాగా గత 15 రోజుల్లో కుంటాల జలపాతంలో పడి మృతి చెందటం ఇది మూడోసారి. -
'దక్షిణభారతదేశంలో ఇలాంటి జలపాతం లేదు'
నేరడిగొండ(ఆదిలాబాద్): దక్షిణ భారతదేశంలోనే కుంటాల లాంటి చక్కటి జలపాతం మరెక్కడా లేదని, ఇక్కడ దట్టమైన అడవులు, కొండ మధ్యలో ఎత్తయిన జలపాతం దృశ్యాలు ఉండడంతో మరిన్ని ఎక్కువ సినిమాలు తీయడానికి ఆస్కారం ఉందని ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ అభిప్రాయం వ్యక్తంచేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల జలపాతం వద్ద ప్రముఖ కథానాయకుడు నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో జలపాతానికి సంబంధించిన సన్నివేశం ఉండడంతో ఇక్కడికి రావాల్సి వచ్చిందని వినాయక్ పేర్కొన్నారు. కుంటాల వద్ద రుద్రమదేవితోపాటు కొన్ని సినిమాలు, సీరియల్స్ కూడా తీశారని, ఇక్కడ ఉన్న మిత్రులైన నిరంజన్‌రెడ్డి, రంగా ద్వారా తెలిసిందన్నారు. దీంతోనే ఇటీవల ఇక్కడి ప్రాంతాలను సందర్శించి వెళ్లినట్లు తెలిపారు. కాగా, ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయలేదని, ప్రముఖ హీరో నితిన్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని వీవీ వినాయక్ వివరించారు. -
జలపాతంలో పడి సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం చూసేందుకు వచ్చి ఓ వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్‌కు చెందిన ఒత్తూరి చైతన్య(24) తొమ్మిది మంది స్నేహితులతో కలసి శనివారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతానికి వచ్చారు. జలపాతం పైభాగం నుంచి దాటే క్రమంలో చైతన్య కాలు జారి అందులో పడిపోయి మృతి చెందాడు. హైదరాబాద్‌లోని దుండిగల్‌కి చెందిన చైతన్య పుణెలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్నాడని మిత్రులు తెలిపారు. మృతదేహాన్ని గజ ఈతగాళ్లు సాయంత్రానికి వెలికితీయగా, బోథ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. -
కుంటాల జలపాతంలో పడి యువకుడి మృతి
నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల జలపాతంలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడ్ని నిజామాబాద్ పట్టణంలోని కోటగల్లీకి చెందిన హేమంత్‌కుమార్ (21)గా గుర్తించారు. ఆదివారం స్నేహితులతో కలసి హేమంత్ కుమార్ కుంటాల జలపాతం వద్దకు వెళ్లాడు. సాయంత్రం సమయంలో కాలు జారి హేమంత్‌కుమార్ నీటిలో పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని జాలర్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీయించారు.