అక్కడ అలా.. ఇక్కడ ఇలా
Published Tue, Jul 26 2016 11:27 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
మహారాష్ర్టలోని సహస్రకుండ్ జలపాతం వద్ద మంచి రక్షణ చర్యలు
పెద్ద సంఖ్యలో వెళ్తున్న పర్యాటకులు
కుంటాల వద్ద కనిపించని కనీస ఏర్పాట్లు
పర్యాటకులకు పొంచి ఉన్న ప్రమాదం
ఇప్పటికే అనేకమంది మృత్యువాత..!
భైంసా : మహారాష్ట్రలోని నాందేడ్, యవత్‌మాల్ జిల్లాల సరిహద్దులో కిన్వట్‌తాలూకా పరిధిలో గల ఇస్లాపూర్‌లోని సహస్రకుండ్(సాసర్‌కుండ్) జలపాతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. అక్కడి ప్రభుత్వం ఈ జలపాతం వద్ద పర్యాటకుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రక్షణ ఏర్పాట్లు చేసింది. నిర్మల్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలోనే ఈ జలపాతం ఉంది. కిన్వట్, బోథ్ తాలూకాలు పక్కపక్కనే ఉంటాయి. అక్కడి సాసర్‌కుండ్ జలపాతానికి పర్యాటకులు పెరుగుతున్నారు. కాని పక్కనే ఉన్న మన జలపాతం వద్ద ఈ సంఖ్య కొంత తగ్గుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం పర్యాటకుల క్షేమం కోసం చేసిన ఏర్పాట్లు మెరుగ్గా ఉన్నాయి. కాని మన తెలంగాణలో అత్యంత ప్రాధాన్యం ఉన్న కుంటాల జలపాతంలో మాత్రం ఇప్పటికీ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు.
సినిమా షూటింగ్‌లైనా..
ఇప్పటికే బోథ్ నియోజకవర్గ పరిధిలో గల నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం వద్ద పెద్దపెద్ద సినిమాల షూటింగ్‌లు జరిగాయి. చిన్న సినిమాలు ఎన్నో తెరకెక్కించారు. ఇక్కడి జలపాతం దృశ్యాలు చూసేందుకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయినా ఇక్కడ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ జలపాతం అంతగా ప్రాధాన్యం లేకపోయిన తెలంగాణ టూరిజం ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడ అభివృద్ధి కోసం ఇప్పటికే టూరిజం బృందం పలుమార్లు పరిశీలించింది. అయినా ఇప్పటికీ ఎలాంటి పనులు చేపట్టలేదు. మహారాష్ట్రలోని సాసర్‌కుండ్ జలపాతానికిసైతం టూరిజం అధికారులు వెళ్లారు. అక్కడి ఏర్పాట్లు పరిశీలించారు. కుంటాలలో అత్యాధునిక టెక్నాలజీతో రోప్‌వే నిర్మాణం చేపడుతామని చెబుతున్నారు. కానీ పెద్ద సంఖ్యలో వెళ్లే సామాన్యుల కోసం సాసర్‌కుండ్‌లా సేఫ్టివాల్‌లు నిర్మించాలని పర్యాటకులు కోరుతున్నారు. కుంటాల వద్ద గతంలో ప్రమాదాల్లో అనేకమంది చనిపోయారు కూడా. అయినా వాటి నుంచి అధికారులు పాఠాలు నేర్వడం లేదు.
అక్కడ అంతా సేఫ్టీ
సాసర్‌కుండ్‌లో జలపాతానికి వెళ్లేందుకు పిల్లర్లు తవ్వి స్లాబు వేశారు. జలపాతం అందాలు వీక్షించేందుకు వీలుగా బండరాళ్లకు లోతుగా తవ్వి ఇనుప చువ్వలు బిగించారు. ఇనుప చువ్వల బయట నుంచి జలపాతం వీక్షించవచ్చు. టవర్‌లాగా వ్యూ పాయింట్ కూడా ఉండడంతో దాన్ని ఎక్కి జలపాతం అందాలన్ని పైనుంచి చూడవచ్చు.
జలపాతం పురాణగాథ
మహారాష్ట్రలోని మహోర్ పుణ్యక్షేత్రం సమీపంలోనే ఈజలపాతం ఉంది. పరుశరాముడు వేసిన బాణం వద్దే జలపాతం పుట్టిందని పురాణగాథలు చెబుతున్నాయి. మహోర్ వెళ్లే యాత్రికులంతా ఇక్కడికి వెళ్తుంటారు. ఈ పుణ్యభూమిలో ఎంతో మంది తపస్సు చేశారనికూడా చెబుతుంటారు.
Advertisement
Advertisement