కుప్పం స్టేషన్లో ఏం జరుగుతోంది..?
►గతంలో రైలు కింద పడబోయిన ఓ మహిళా కానిస్టేబుల్
►ఇప్పుడు నిద్రమాత్రలు మింగిన మరో మహిళ
►సెలవుపై వెళ్లిపోయిన ముగ్గురు ఎస్ఐలు
►అన్నీ తెలిసినా ఉన్నతాధికారుల మౌనముద్ర
►డీజీపీకి విన్నవించినా జరగని న్యాయం
కుప్పం/చిత్తూరు (అర్బన్): క్రమశిక్షణకు మారుపేరైన పోలీసుశాఖలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు తమకు జరిగిన అన్యాయంపై ధైర్యం చేసి గళం విప్పారు. రాష్ట్ర పోలీస్ బాస్ చూసేలా తమ కష్టాన్ని చెప్పుకున్నారు. అయినా సరే స్పందించలేదు. అంతిమంగా ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనుకాడలేదు. మహిళా పోలీసు విభాగం (షీ టీమ్) చేస్తున్న సేవలకు రాష్ట్ర ఉత్తమ షీ టీమ్ అవార్డును, రూ.లక్ష రివార్డును గెలుచుకున్న చిత్తూరు విభాగంలో తాజా పరిణామం కలకలం సృష్టిస్తోంది. జిల్లా పోలీసు యంత్రాంగంలో మహిళలపై జరుగుతున్న వేధింపులకు అద్దం పడుతోంది.
బాధితుల మాట..
కుప్పం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నిర్మల, రేణుక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇంటర్, డిగ్రీ విద్యార్హతతో పోలీస్ శాఖలోని కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. చిత్తూరులో పనిచేస్తున్న వీరు షీ టీమ్‌లో రెండేళ్లుగా కుప్పం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. తాము విధుల్లో చేరినప్పటి నుంచి సీఐ రాజశేఖర్ తమను అసభ్య పదజాలం తో దూషిస్తూ.. స్టేషన్లో అందరి ముందే అవమానకరంగా మాట్లాడుతున్నారన్నారు. దీనిపై 20 రోజుల క్రితం షీ టీమ్ వాట్సప్ గ్రూప్‌లో తమతో పాటు నలుగురు మహిళా కానిస్టేబుళ్లు మెసేజ్ పెట్టామన్నారు. సీఐ బూతులు తిడుతున్నారని, తమకు వేధింపులు ఎక్కువగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. గ్రూప్‌లో డీజీపీ సైతం ఉండటంతో ఆయన చూసి విచారించాలని ఎస్పీని ఆదేశించడం.. ఎస్పీ నుంచి మహిళా స్టేషన్ డీఎస్పీకి విచారణ చేయాలని ఆదేశాలు అందాయి.
గతనెల 24న నిర్మల, రేణుక చిత్తూరుకు వచ్చి మహిళా స్టేషన్ డీఎస్పీని కలిసి తాము పడుతున్న ఇబ్బందులు వివరించారు. అయితే ఏం జరిగిందని అడగకుండా.. అసలు వాట్సప్‌లో ఏది పడితే అది పెట్టమని మీకు ఎవరు చెప్పారు..? అంటూ గద్దించడంతో భయపడ్డారు. రెండు రోజుల తరవాత వస్తే విచారిస్తామని చెప్పడంతో మళ్లీ చిత్తూరుకు వచ్చారు. ఇలా ఏడు సార్లు కుప్పం నుంచి చిత్తూరుకు తిరిగి విసిగి వేసారిపోయిన ఇద్దరు మంగళవారం డీఎస్పీని కలవడానికి వచ్చి ఆయన మళ్లీ రేపు రమ్మని చెప్పడంతో కుమిలిపోయారు. రేణుక నీరు తాగడానికి బయటకు వెళ్లగా నిర్మల తన వద్ద ఉన్న 12 నిద్ర మాత్రలు, బాటిల్లో ఉన్న విషం తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వెంటనే గుర్తించిన రేణుక, నిర్మలను చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పిండంతో ప్రాణాలతో బయటపడ్డారు.
ఇలా ఎన్నో...
కుప్పం సీఐ రాజశేఖర్‌పై చాలా ఆరోపణలున్నాయి. ఆర్నెళ్ల క్రితం సీఐ వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసుకోపోయారు. స్థానికులు ఈమెను అడ్డుకుని రక్షించారు. విషయం బయటకు రాకుండా అధికారులు తొక్కి పెట్టారు.
కుప్పం సర్కిల్‌లోకి వచ్చే రాళ్లబుదుగూరు ఎస్ఐ గోపీ, రామకుప్పం ఎస్ఐ పరశురామ్, కుప్పం ఎస్ఐ వెంకటచిన్నలు సీఐ వేధింపులు తట్టులేక మెడికల్ లీవుపై వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ స్టేషన్లలో కొత్త ఎస్ఐలు పనిచేస్తున్నారు. అయినా సరే ఉన్నతాధికారులు మౌనం వహిస్తున్నారే తప్ప సీఐపై ఎలాంటి విచారణకు ఆదేశించకపోవడం గమనార్హం. ఇందుకు రాజకీయ ఒత్తిళ్లే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
‘‘ మేమేం తప్పు చేశాం..? మాకు జరిగినఅవమానాన్ని మా పోలీసులకు చెప్పుకోవడమే తప్పా..? జరిగిన అవమానాన్ని డీఎస్పీ చెబితే నోరు ముసుకుని ఉండమంటున్నారు. ఇదే ఓఆఫీసర్కు జరిగుం టే గమ్మున ఉండేవాళ్లా..? ఆత్మగౌరవాన్ని చంపుకుని బతకలేను. అందుకే చచ్చిపోతున్నా. అమ్మా తమ్ముడ్ని బాగా చదివించు. కానీ పోలీస్ మాత్రం చేయకు..’’అని నిర్మల సూసైట్ నోట్ రాశారు.