వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడిగా సురేష్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా జి.సురేష్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సురేష్‌రెడ్డి ఇదివరకు సూరారం కార్పొరేటర్‌గా పనిచేశారు. పార్టీలో చురుకైన వ్యక్తిగా పేరున్న సురేష్‌రెడ్డి.. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని, త్వరలో కార్యచరణ ప్రకటించనున్నామని వెల్లడించారు.
రాష్ట్ర కమిటీలో జిల్లాకు పెద్దపీట
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ నూతన కార్యవర్గం శుక్రవారం ఏర్పాటైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియమితులైన రాష్ట్ర కమిటీలో జిల్లా నేతలకు కీలక పదవులు దక్కాయి. రాష్ట్ర కార్యదర్శులుగా ఏనుగు మహిపాల్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), జి.సూర్యనారాయణరెడ్డి (మల్కాజిగిరి), కె.అమృతాసాగర్ (ఇబ్రహీంపట్నం) నియమితులయ్యారు.
అదేవిధంగా అనుబంధ శాఖల్లోనూ జిల్లా నేతలకు పెద్దపీట వేశారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన ముస్తాక్ అహ్మద్ నియమితులయ్యారు. వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ విభాగం పగ్గాలను జార్జ్ హార్బర్ట్కు అప్పగించారు. పార్టీ అధికార ప్రతినిధులుగా సీనియర్‌నేత కొండా రాఘవరెడ్డి, కూకట్‌పల్లికి చెందిన సత్యం శ్రీరంగం నియమితులయ్యారు.
సమరశీల ఉద్యమాలు చేపడతా
నగర పరిధిలోని బస్తీలు, రూరల్ మండలాల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల ఉద్యమాలు చేపడతా. హైదరాబాద్ నగరంతో మిళితమైన రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే నియోజవర్గాలతోపాటు, గ్రామీణ నియోజవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తా. పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం.
- కొండా రాఘవరెడ్డి, అధికార ప్రతినిధి