ఇప్పటికి ఆ ఆలోచన లేదు!
‘‘నాకు ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. 2003లో ఇండస్ట్రీకొచ్చినప్పుడు ఐదారేళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నా. దీంతో బ్యాక్ టు సాఫ్ట్వేర్ జాబ్ అనుకున్నా. ఆ పరిస్థితుల్లో ‘చక్రవాకం’ సీరియల్ నాకు మంచి బ్రేక్ ఇచ్చింది’’ అని చెప్పారు నటుడు సాగర్. ఆర్కే నాయుడు, మున్నాగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడైన సాగర్ హీరోగా నటించిన చిత్రం ‘సిద్ధార్థ’. సాగర్, సాక్షీ చౌదరి, రాగిణి ప్రధాన పాత్రల్లో కేవీ దయానంద్ రెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రవిశేషాలను సోమవారం పాత్రికేయుల సమావేశంలో సాగర్ పంచుకున్నారు...
అనంతపురం ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో కథ ఉంటుంది. యాక్షన్ నేపథ్యంలోనే ప్రేమకథ కూడా ఉంటుంది. కథానుగుణంగా ఇరవై ఐదురోజులు మలేసియాలో చిత్రీకరణ జరిపాం. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ అనిపించకుండా కమర్షియల్ ఫార్మాట్లో తెరకెక్కించాం. ఆడియన్స్ డిజప్పాయింట్ కారు స్మాల్ స్క్రీన్ అయినా, బిగ్ స్క్రీన్ అయినా నటనలో పెద్దగా తేడా అనిపించలేదు. టీవీ కంటే సినిమాకు హై టెక్నికల్ వేల్యూస్ ఉంటాయి.
ఈ చిత్రంలో పాటలు సందర్భోచితంగా ఉంటాయి. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాత ఖర్చు, క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు. ఈ చిత్రానికి ఎస్.గోపాల్‌రెడ్డి, మణిశర్మ, పరుచూరి బ్రదర్స్ వంటి సీనియర్లు పనిచేయడం నా అదృష్టం. ఈ నెల 22న టీజర్, నెలాఖరులో పాటలు, సెప్టెంబరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. మళ్లీ సీరియల్స్‌లో నటించమని అడుగుతున్నారు. ఇప్పటికి ఆ ఆలోచన లేదు. ప్రస్తుతానికి నా దృష్టి సినిమాలపైనే ఉంది. మంచి పాత్రలు వస్తే ఇతరుల చిత్రాల్లోనూ చేస్తా. సొంత ప్రొడక్షన్ చేయాలనే ఆలోచన ఉంది.