అర్హులందరికీ రుణమాఫీ
అనంతపురం సెంట్రల్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని రాష్ట్ర పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. గురువారం డ్వామా హాలులో ఎమ్మెల్యేలతో కలిసి రుణమాఫీ అమలుపై సమీక్షించారు. మంత్రులు మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ, బంగారు, స్వయం సహాయక సంఘాలకు సంబంధిం చి 8,96,177 ఖాతాలు ఉన్నాయని, రూ. 4944 కోట్లు మాఫీ చేయబోతున్నామన్నారు.
అయితే మొత్తం ఖాతాల్లో 2.80 లక్షల మంది ఇప్పటి కీ ఆధార్, రేషన్‌కార్డులు సమర్పించలేదన్నారు. వీరికి డిసెంబర్ 25 వరకూ అవకాశం ఉందని తెలిపారు. పంట రుణాలు లేకున్నా వ్యవసాయం కోసం బంగారు తాకట్టు పెట్టి రూ. 1.50 వేల వరకూ అప్పు తీసుకున్నా మాఫీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. పండ్లతోటల రైతులకు కూడా రుణమాఫీ వర్తిం చేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడతామన్నారు.
దీంతోపాటు 2011-12లో ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం కలిపి రూ. 675 కోట్లు రావాల్సి ఉందని, త్వరలో ఈ మొత్తం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇటీవల 53 మండలాలకు రూ. 227 కోట్లు వాతావరణబీమా మంజూరైందన్నారు. ఈ మొత్తం రైతు అప్పులకు జమ చేయరాదని బ్యాంకర్లను ఆదేశించారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెప్పిస్తామన్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మద్యం సిండికేట్ల వ్యవహారంపై సీబీసీఐడి విచారణ జరుగుతోందన్నారు. జూన్‌నాటికి నూతన పాలసీ విధానం తీసుకొచ్చి మద్యం నియంత్రిస్తామని వివరించారు. వీలైనన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి బయట రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మూడు క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కడెక్కడ వీటిని ఏర్పాటు చేయాలనేది త్వరలో నిర్ణయిస్తామన్నారు.
చేనేత కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు, క్రెడిట్‌కార్డులు మంజూరు చేస్తామన్నారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు ప్రభాకర్‌చౌదరి, వరదాపురం సూరి, ఉ న్నం హనుమంతరాయచౌదరి, వీరన్న, ఎమ్మెల్సీలు గేయానంద్, శమంతకమణి, గుండుమల తిప్పేస్వామి, మేయర్ స్వరూ ప, కలెక్టర్ సొలమాన్ ఆరోగ్యరాజ్, జా యింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఎల్డీఎం జయశంకర్, వ్యవసాయశాఖ జేడీ శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో మూడు మెగా క్లస్టర్లు
అనంతపురం ఎడ్యుకేషన్ :చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో మూడు మెగా క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గురువారం రాత్రి స్థానిక డ్వామా హాలులో చేనేత, జౌళి శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. చేనేత కార్మికులకు హెల్త్ఇన్సూరెన్స్, క్రిడెట్కార్డుల జారీ, సబ్సిడీపై దారం సరఫరాకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు.
జిల్లాలో పెద్దపప్పూరు, రాయదుర్గం, సోమదేవరపల్లిలో ఏర్పాటు చేసిన మినీక్లస్టర్ల ద్వారా చేనేత కార్మికుల జీవన స్థితిగతులను మెరుగుపరుస్తామన్నారు. చేనేత, జౌళిశాఖ ఏడీ జగన్నాథశెట్టిపై మంత్రులు కొల్లు రవీంద్ర, పల్లె రఘునాథరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖలో అవినీతి పెరిగిపోయిందని, మామూళ్లు ఇస్తేనే పనులు చేస్తున్నారంటూ ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి ఆధారాలతో మం త్రుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో మంత్రులు ఏడీపై మండిపడ్డారు.