క్రిష్‌ను ప్రశంసిస్తూ సింగీతం లేఖ
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిన దర్శకుడు క్రిష్ కు ఇప్పటికీ ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి. ఓ భారీ చిత్రాన్ని అతి తక్కువ రోజుల్లో తెరకెక్కించి సూపర్ హిట్ చేసిన క్రిష్, ప్రతిష్టాత్మక కేవీ రెడ్డి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ ఆయనకు స్వహస్తాలతో లేఖరాసి పంపారు. ఈ సందర్భంగా సింగీతం క్రిష్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
'యువ కళావాహిని వారు ఈ సంవత్సరపు కేవీ రెడ్డి అవార్డును నా అభిమాన దర్శకుడు క్రిష్ కు ఇస్తున్నారని తెలిసి, ఒకప్పుడు నాకు ఇదే అవార్డు వచ్చినప్పటి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ సంతోషిస్తున్నాను. నా గురువుగారు కేవీ రెడ్డి గారి ప్రతిభను ప్రతిభింభించే మూడు ముఖ్య గుణాలు - స్పష్టత, బాధ్యత, పవిత్రత. ఈ మూడు గుణాలు క్రిష్ లో పుష్కలంగా ఉన్నాయి. ఇది అతని మొదటి సినిమా గమ్యంలోనే చూసాను. అప్పుడు అతనెవరో నాకు తెలీదు. అతన్ని వెతికి, ఫోన్ నంబర్ పట్టి, మాట్లాడి అభినందించాను. నేనూహించినట్లుగానే క్రిష్ గమ్యం మొదలు గౌతమిపుత్ర శాతకర్ణి వరకు ప్రతి చిత్రాన్నీ ఒక కళాఖండంగా తీర్చిదిద్దుతూ అదే సమయంలో వ్యాపారాత్మక అవసరాలను విస్మరించకుండా తనదైన శైలిలో ముందుకు సాగిపోతున్నాడు.
క్రిష్ మున్ముందు ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీసి, అతి త్వరలోనే అంతర్జాతీయ ఖ్యాతి పొందుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అతనికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, స్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. క్రిష్ కు నా హృదయ పూర్వక ఆశీస్సులు.' అంటూ ఈ నెల 22న లేఖ రాశారు. ఈ లేఖ పై స్పందించిన క్రిష్, సీనియర్ దర్శకులు సింగీతం గారు రాసిన ఈ లేఖను జీవితాంతం గుర్తుంచుకుంటాను అంటూ ట్వీట్ చేశారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కంచె సినిమాలో సింగీతం శ్రీనివాస్ ఓ కీలక పాత్రలో నటించారు.