కొత్త అధ్యాయాన్ని లిఖిస్తాం
జపాన్ పర్యటనపై ప్రధాని మోడీ
* ఇరుదేశాల మధ్య సంబంధాలను ఉన్నతస్థాయికి తీసుకెళతాం
* ఆసియాలో శాంతి, స్థిరత్వంలో జపాన్ పాత్ర ఎంతో ఉందని కితాబు
* రెండు పురాతన బౌద్ధాలయాలను సందర్శించిన ప్రధాని
* క్యోటోను ఆధునిక నగరంగా తీర్చిదిద్దడంపై ప్రజెంటేషన్ ఇచ్చిన మేయర్
* టోక్యోకు చేరుకున్న మోడీ... నేడు ద్వైపాక్షిక సదస్సు
టోక్యో: జపాన్‌లో తన పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ పర్యటనతో ఇరు దేశాల వ్యూహాత్మక, అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్యం మరింత మెరుగుపడుతుందని వ్యాఖ్యానించారు. ఐదు రోజుల జపాన్ పర్యటనలో రెండో రోజు మోడీ క్యోటో నగరంలో రెండు పురాతన బౌద్ధాలయాలను సందర్శించారు.
అనంతరం పురాతన నగరమైన క్యోటోను అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దిన అంశంపై ఆ నగర మేయర్ దైసాకా కడోకవా మోడీకి ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మోడీ అక్కడి నుంచి బయలుదేరి ఆ దేశ రాజధాని టోక్యోకు చేరుకున్నారు. ఇక్కడ సోమవారం ద్వైపాక్షిక సదస్సులో పాల్గొంటారు. దీనిలో ఇరుదేశాల మధ్య భద్రతా సమాలోచన ఒప్పందం కుదుర్చుకోనున్నారు.
మా ప్రాధాన్యం తెలుస్తోంది..
టోక్యోకు బయలుదేరే ముందు మోడీ మాట్లాడారు. తాను భారత పొరుగుదేశాలకు అవతల ఒక దేశంతో ద్వైపాక్షిక పర్యటన జరపడం ఇదే మొదటిదని, జపాన్‌కు భారత్ ఇస్తున్న ప్రాధాన్యమేమిటో దీనిద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు. భారత్‌లోనే కాదు ఆసియా ఖండంలో శాంతి, స్థిరత్వం, అభివృద్ధి విషయంలో జపాన్ పాత్ర ఎంతో ఉందన్నారు. తన జపాన్ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని.. వ్యూహాత్మక, అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్యం మరింత మెరుగుపడుతుందని మోడీ వ్యాఖ్యానించారు.
బౌద్ధాలయాలను సందర్శించిన ప్రధాని
జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి క్యోటోలోని తొజి, కింకాకుజి బౌద్ధాలయాలను మోడీ సందర్శించారు. తెల్లని కుర్తా, పైజామాపై స్లీవ్‌లెస్ కోటు ధరించిన ప్రధాని.. తొజి ఆలయంలో దాదాపు అరగంట సేపు గడిపారు. ఎనిమిదో శతాబ్ధం నాటి ఆ ఆలయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన పూజారి యాసు నగమోరీ ఐడెంటిటీ కార్డుపై పేరును చూసిన మోడీ... ‘నేను మోడీ.. మీరు మోరీ’ అంటూ సరదా వ్యాఖ్యలు చేశారు.
అనంతరం బంగారు ఆకులతో అలంకరించి ఉండే కింకాకుజి ఆలయానికి వెళ్లిన మోడీ పర్యాటకుల్లో పూర్తిగా కలిసిపోయారు. వారికి షేక్‌హ్యాండ్ ఇస్తూ.. కలిసి ఫొటోలు దిగారు. షింజో అబే భారత్-జపాన్ చారిత్రాక, సంస్కృతిక సంబంధాలను గుర్తుచేసుకున్నారు. మోడీతో కలిసి భోజనం చేయడం చాలా సంతోషం కలిగించిందన్నారు. అయితే ఒక జపాన్ ప్రధాని తమ రాజధానికి బయట మరో దేశ నేతను ఇలా కలుసుకోవడం చాలా అరుదు కావడం విశేషం. మోడీ కోసమే అబే క్యోటోకు వచ్చారు.
ఎనీమియాపై సాయం కోరిన ప్రధాని..
భారత్‌లోని గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిని నిర్మూలించడంలో మోడీ క్యోటో విశ్వవిద్యాలయం సాయాన్ని కోరారు. మూలకణాలపై పరిశోధనకు నోబెల్ బహుమతి పొందిన యమనకతో ఈ వ్యాధికి చికిత్సను అభివృద్ధి చేసే అంశంపై చర్చించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన క్యోటో వర్సిటీ.. ఈ వ్యాధిపై పరిశోధనలో కలిసి పనిచేస్తామని, సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది.
కీలక ఒప్పందాలపై సంతకాలు..
ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక, వాణిజ్యం, మౌలిక సౌకర్యాల అభివృద్ధి తదితర అంశాలపై సోమవారం ఆ దేశ ప్రధాని షింజో అబేతో మోడీ చర్చలు జరుపనున్నారు. దీంతో పాటు అరుదైన ఖనిజాల వెలికితీత, రక్షణ, పౌర అణు కార్యక్రమానికి సంబంధించి పలు ఒప్పందాలపై ఇరు దేశాల అధినేతలు సంతకాలు చేయనున్నారు.