‘108’ సమ్మె వాయిదా !
కొలిక్కిరాని ఉద్యోగులు, జీవీకే మధ్య చర్చలు
హైదరాబాద్: 108 వైద్య సర్వీసుల ఉద్యోగుల సంఘం, జీవీకే ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. కార్మిక శాఖ కమిషనర్ అజయ్ సమక్షంలో శుక్రవారం జరిగిన చర్చల్లో ఏమీ తేలక పోవడంతో తిరిగి ఈ నెల 13న సాయంత్రం 4 గంటలకు మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించారు. దీంతో 108 వైద్య సర్వీసుల ఉద్యోగుల సమ్మె 13వ తేదీకి వాయిదా పడింది.
ఆ రోజు చర్చలు సఫలం కాకపోతే అదే రోజు అర్ధరాత్రి నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతామని 108 ఉద్యోగుల ప్రతినిధులు స్పష్టం చేశారు. కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగ సంఘం ప్రతినిధులు, జీవీకే ప్రతినిధులతో కార్మిక శాఖ కమిషనర్ అజయ్ శుక్రవారం చర్చలు జరిపారు. ఉద్యోగుల సంఘం తరఫున షబ్బీర్ అహ్మద్, జూపల్లి రాజేందర్, మామిడి నారాయణ, రూప్సింగ్, అశోక్, మహేందర్రెడ్డి, జీవీకే తరఫున బ్రహ్మానందరావు, శ్రీరామచంద్రరాజు పాల్గొన్నారు.