లేబర్ మేస్త్రీ కొడుకు సివిల్స్ విజేత
జలుమూరు : మండలంలోని జోనంకి పంచాయతీ గంగాధరపేటకు చెందిన పూజారి కృష్ణారావు సివిల్ సర్వీస్-2013లో 776 ర్యాంక్ సాధించారు. జిల్లాతోపాటు స్వగ్రామానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. తండ్రి అప్పలనాయడు వృత్తిరీత్యా లేబర్ మేస్త్రీ. తల్లి భూదేవి గృహిని. తల్లిదండ్రులిద్దరూ నిరక్షరాస్యులే. నిర్లక్షరాస్యుల ఇంట సర్వతీ పుత్రుడు జన్మించాడు. కృష్ణారావు ఉన్నత శిఖరాలను అధిరోహించి యవతీ యవకులకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన ఒకటి నుంచి ఐదో వరకు హుస్సేనుపురం పంచాయతీ తమ్మయ్యపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నారు. ఆరో తరగతి విశాఖపట్నంలో చదివారు. ఏడు నుంచి 10వ తరగతి వరకు సింహాచలం రెసిడెన్సియల్ స్కూల్లో విద్యనభ్యసించారు. ఇంటర్, డిగ్రీ కూడా విశాఖలో పూర్తి చేశారు. చెన్నైలో అప్లయిడ్ బయోలాజీ (ఎంస్సీ) పూర్తి చేశారు. కృష్ణారావు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు సిద్ధమయ్యారు. 2011 కేంద్ర హోమంత్రిత్వ శాఖలో ఉద్యోగానికి ఎంపికయ్యారు.
లక్ష్యం కోసం నిరంతరం సాధన చేయాలి
మనం ఏది సాధించాలనుకున్నామో ఆ లక్ష్యం కోసం నిరంతరం సాధన చేయాలి. అన్నిటి కంటే మన మీద మనకు నమ్మకం ప్రధానం. లక్ష్యాన్ని చేరుకునేందుకు నిజాయితీగా కష్టించి పనిచేయాలి. తరువాత విజయం మనల్ని వరిస్తుంది. నేను ఈ స్థాయికివెళ్లడానికి తల్లిదండ్రులుతోపాటు భార్య మనీషా ఎంతో సహకారం అందించారు. భార్య వృత్తిరీత్తా వైద్యురాలు. ఆమె ఎంతో బిజీగా ఉన్నా... నా బాధ్యతలను నిరంతరం గుర్తు చేసి, విజయానికి ఎంతో సహకారం అందించారు.
పూజారి కృష్ణారావు, సివిల్స్ విజేత