గిరిజనుడిని బలిగొన్న అధికార మదం
- విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుడి అఘాయిత్యం
- చెక్కతో తలపై కొట్టడంతో మృతి
- నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపాన్ని ప్రశ్నించినందుకు దాడి
- వీధినపడ్డ గిరిజనుడి కుటుంబం
సాలూరు: గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేదని ప్రశ్నించిన పాపానికి ఓ గిరిజనుడు బలైపోయాడు. అధికార మదంతో టీడీపీ నాయకుడే ఆ గిరిజనుడిని హత్య చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం తుండ పంచాయతీ ఇటుకలవలసలో మావుడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సారికొండ మందయ్య సీసీ రోడ్డు నిర్మాణ పనులు దక్కించుకున్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తోందని, రాతిపిక్క(చిప్స్) ఎక్కువగా వేస్తున్నారని గిరిజనుడైన పాలిక లచ్చయ్య(35) శనివా రం పనులు చేయిస్తున్న మందయ్యను ప్రశ్నించాడు. దీంతో కోపోద్రిక్తుడైన మం దయ్య పక్కనే ఉన్న చెక్కతో తలపై బలంగా కొట్టడంతో లచ్చయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే మందయ్య అక్కడి నుంచి జారుకున్నాడు.
లచ్చయ్య తల నుండి రక్తం కారడాన్ని గమనించిన స్థానికులు ‘108’కు సమాచారం ఇచ్చారు. ‘108’ సిబ్బంది లచ్చయ్యను సాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి జిల్లా కేంద్ర ఆస్పత్రికి, ఆపై విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో లచ్చయ్య తుదిశ్వాస విడిచినట్లు పోలీసులు వెల్లడించారు.
అనాథలైన భార్య, పిల్లలు
గిరిజనుడు లచ్చయ్య మృతి చెందడంతో ఆయన కుటుంబం వీధిన పడింది. నాలుగు నెలల గర్భిణి అయిన భార్య ముత్తమ్మ, 12 ఏళ్ల కుమారుడు, 8 ఏళ్ల కుమార్తె స్వాతి అనాథలయ్యారు.కుటుంబాన్ని పోషించిన ఇంటిపెద్ద ఇక లేకుండా పోయాడంటూ ముత్తమ్మ రోదించింది. లచ్చయ్య మృతదేహం విశాఖ నుంచి ఆదివారం సాయంత్రం ఇటుకలవలసకు చేరుకుంది.పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.
అనధికారికంగా కాంట్రాక్ట్ పనులు
సాలూరు మండలంలో రెండు, మూడు పంచాయతీలకు నాయకుడిగా చెలామణీ అవుతున్న సారికొండ మందయ్య స్థానిక సర్పంచ్‌లు చేయించాల్సిన పనులను అనధికారికంగా కాంట్రాక్ట్‌కు తీసుకుని చేయిస్తున్నాడు. జిల్లా పరిషత్ ద్వారా మంజూరయ్యే పనులపై కూడా పెత్తనం చెలాయిస్తున్నాడు.
అసెంబ్లీలో ప్రశ్నిస్తా
‘‘సాలూరు నియోజకవర్గంలో గిరిజనులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, దాడులపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా. లచ్చయ్య మృతికి కారణమైన టీడీపీ నేత మందయ్యను కఠినంగా శిక్షించాలి. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి.మెంటాడ మండలం ఆండ్రలో ఇటీవల గిరిజన మహిళపై లైంగికదాడి జరిపారు. మక్కువ మండలంలోని కొత్తకాముడివలసలో దంపతులను కొట్టి, కాల్చి చంపారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’
- పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు