దంపతుల ఆత్మహత్యాయత్నం
జవహర్‌నగర్ : కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన దంపతులు ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకన్న, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా రాజాపేట గ్రామానికి చెందిన పబ్బోజు హరి(40), పద్మ(34) దంపతులు ఆరేళ్ల క్రితం బతుకుదెరువు కోసం జవహర్‌నగర్‌కు వలస వచ్చారు. వీరి కుమార్తెలు శ్రావ్య(13) సోనీ(11) స్థానిక పాఠశాలలో చదువుకుంటున్నారు. కార్పెంటర్ పనిచేసే హరి నిత్యం మద్యం తాగుతూ భార్యతో గొడవపడుతున్నాడు. కుటుంబ పోషణకు డబ్బులు ఇచ్చేవాడు కాదు. దీంతో పద్మ స్థానికంగా ఓ లేడిస్ టైలర్స్‌లో పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది. మద్యం మానేయాలని పలుమార్లు పద్మ భర్తకు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు ఇటీవల వీరికి ఆర్థిక ఇబ్బందులు కూడా తోడయ్యాయి.
ఈ క్రమంలో గురువారం ఉదయం 8 గంటల సమయంలో భార్యభర్త తిరిగి తీవ్రంగా ఘర్షణ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన పద్మ ఇంట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటల బాధ తాళలేక బయటకు పరుగులు తీసింది. భార్య ఆత్మహత్యాయత్నం చేయడంతో హరి కూడా అక్కడే ఉన్న కిరోసిన్ డబ్బాను తీసుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. చిన్న కూతురు సోనీ విషయం గమనించి ఓ బకెట్ సాయంతో తల్లిదండ్రులపై నీళ్లు పోసింది. స్థానికులు మంటలు ఆర్పి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాలపాలైన దంపతులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన హరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా, పద్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.