మరో క్రేజీ ప్రాజెక్టులో 'శివగామి'
హైదరాబాద్: సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుతున్న టాలీవుడ్ అందాలనటి రమ్యకృష్ణ మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. అదీ భర్త కృష్ణవంశీ తదుపరి చిత్రం రుద్రాక్ష సినిమాలో. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తోందట. కృష్ణవంశీ తరహాలో తెరకెక్కుతున్న ఓ హీరోయన్ ఓరియంటెడ్ మూవీలో లేడీ సైకాలజిస్టుగా ప్రేక్షకులను అలరించనుందట.
పవర్ ఫుల్ పాత్రల్లో తన విలక్షణమైన నటనతో ఆకట్టుకున్న రమ్య.. బాహుబలి, సోగ్గాడే చిన్నినాయనా సినిమాలతో తన టాలెంట్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకుంది. టాలీవుడ్లో తనవైన ప్రత్యేక కారెక్టర్లతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో మెయిన్ లీడ్‌లో నటించేందుకు అనుష్క మొదట ఓకే చెప్పినా, తరువాత తిరస్కరించింది. దీంతో ఆ కారెక్టర్‌ను సమంత దక్కించుకున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల రమ్య-కృష్ణవంశీ దంపతులు విడివిడిగా ఉంటున్నారనే వదంతుల నేపథ్యంలో ఈవార్త ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా రుద్రాక్ష సినిమాలో కావాలనే రమ్యకృష్ణ కోసం ఓ పాత్రను సృష్టించి, కథను కూడా కాస్త మార్చినట్టు టాలీవుడ్ టాక్. కృష్ణవంశీ తీసిన చంద్రలేఖ సినిమాలో నటిస్తున్న సమయంలో రమ్యకష్ణ, కృష్టవంశీ ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.