వాళ్లు 'బంద్'ను భుజానేసుకున్నారు
(సాక్షి వెబ్ ప్రత్యేకం)
పైన ఎండ, కడుపులో ఆకలి సుర్రుమంటున్నాయి.
నెత్తిన ముసుగు సరిచేసుకుంటూ .. రోడ్డు క్రాస్ చేస్తున్నా..
ఈ ఆర్టీసీ బంద్ ఏమో గానీ దేవుడా... ఇంటికి ఎలా వెళ్లాలిరా బాబూ.. పక్కన ఇద్దరు అమ్మాయిల మాటలు లీలగా వినబడుతున్నాయి.
హుమ్! అనుకుంటూ.. రోడ్డు క్రాస్ చేసి బస్టాప్‌లో నిలబడ్డా.. ఏదో ఒక ప్రైవేటు వెహికల్ రాకపోతుందా అనుకుంటూ..
రోడ్డు మీద ఒక ఆర్టీసీ బస్సు కూడా లేకపోయినా.. ట్రాఫిక్ మాత్రం విపరీతంగా ఉంది.. నగరంలో ఉన్న వాహనాలన్నీ రోడ్లమీదికి వచ్చేసినట్టున్నాయి.
ఇంతలో.. ఓయ్! అని పిలిచారు ఎవరో.. తిరిగి చూస్తే నా ఫ్రెండ్.. రావోయ్.. నేను అటే వెళుతున్నా.. కొంతదూరం డ్రాప్ చేస్తా.. అంది కారు డోర్ తీసి....
వేరే ఆలోచించే టైమ్ కూడా ఇవ్వలేదు నాకు.. దాదాపు కారులోకి గుంజినంత పనిచేసింది. కూర్చునే సర్దుకునే లోపే సోమాజిగూడ రానేవచ్చింది... నన్ను అక్కడ దించేసి తను వెళ్లిపోయింది.
హు! మళ్ళీ బస్సుకోసం ఎదురు చూపులు.. చకోరపక్షిలా...
ఇంతలో సడన్‌గా టపా టపా కాదు.. ధబీ...ధబీ.. పెద్ద పెద్ద చినుకులతో వాన మొదలైంది.
అమీర్ పేట్.. ఎస్ఆర్ నగర్.... అరుస్తున్నాడు ఒక ప్రైవేటు బస్సువాలా...
హమ్మయ్య అనుకుంటూండగానే.. .. ఎక్కడనుంచి వచ్చారో తెలియదు బిలబిల మంటూ పదిహేనుమంది మహిళలు... సినిమాల్లోని స్పీడ్ సీన్లో లాగా ఎక్కేసి కూర్చున్నారు.
దాదాపు అందరికీ సీట్లు దొరికాయి.
ఒకసారి అందరినీ చూశా.... కొందరు ముభావంగా.. ..ఏదో ఒకటి దొరికింది.. సగం దూరం వెళ్లిపోవచ్చు అన్న ఊరటలో మరికొంతమంది. చాలా మంది ఎపుడు ఇంటికి చేరతామా అన్నట్టుగా దిగులుగా కనిపించారు. వాళ్లను అలా చూడగానే .. ''ఆయన ప్యాంటుతొడుక్కొని ఆఫీసుకు వెళితే.. నేను నా ఇంటిని తొడుక్కొని బయలుదేరాను'' అన్నప్రముఖ రచయిత్రి శిలాలోలిత కవిత పాదాలు గుర్తొచ్చాయి. అందరూ ఉద్యోగినులే. తలా బ్యాగులో ఒడిలో పెట్టుకుని కూచున్నవారి మొహాల్లో ఆఫీసులో అలసట కంటే బంద్ ప్రభావమే ఎక్కువ కనిపిస్తోంది.
ఎన్నాళ్లండీ ఈ బంద్ బాబూ? అన్నారెవరో.. ఏమోనండీ ప్రభుత్వం కూడా మొండిగానే కనిపిస్తోంది కదా.. ఇంకో గొంతు.
అయినా ఈ ఆర్టీసీని ప్రైవేటు పరం చేసెయ్యాలండీ.. అపుడు గానీ బుద్ధి రాదు.. ఆవేశంగా ఓ యువతి.
ఇంతలో ఓ పెద్దావిడ కలుగజేసుకొని.. నో. నో.. అలా అనకూడదమ్మా.. మనం కూడా కొంచెం స్థిమితంగా ఆలోచించాలి. వాళ్ల కోరికలు తీరాలంటే సమ్మె చేయక తప్పదు కదా... పీత కష్టాలు పీతవి.. అన్నారు. వానొచ్చినా వరదొచ్చినా.. చివరికి ఏ బంద్ వచ్చినా మనకే బాధలు.. బస్సుల కోసం తిప్పలు...ఆటోల కోసం పరుగులు. ఏం చేస్తాం... నిట్టూర్చింది.
ఏయ్! మీకో విషయం తెలుసా...అసలు ఈ నిరసనలు.. సత్యాగ్రహాలు... మన ఆడవాళ్ల నుంచే మన జాతిపిత గాంధీ కాపీ కొట్టేశారట తెలుసా..అంది ఉత్సాహంగా అంది మరో యవతి.
అవునా... మనల్ని కాపీకొట్టి. మనల్ని వెనక్కి నెట్టేసి వాళ్లు జాతీయ నాయకులు అయిపోయారన్నమాట....మోసం..అన్యాయం... ఛీటింగ్ అన్నాను నేను సినీ ఫక్కీలో.. నవ్వులే.. నవ్వులు.
ఇంతలో ఎస్ఆర్ నగర్ వచ్చేసింది దిగండి.. అన్నాడు డ్రైవర్ ..
అందరూ అయోమయంగా చూస్తున్నాం. .. దిగండమ్మా... దిగండి.. ఏదో పోనీలే అని ఎక్కించుకుంటే.. అంటున్నాడు.. మా అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ...ఫ్రీగా తీసుకొచ్చినట్టు ఫోజు.
అదేంటి.. మైత్రీవనంలో ఆపి ఎస్ఆర్నగర్ అంటాడు...పైగా ఏదో సేవ చెసినట్టు బిల్డప్పూ... వీడూనూ.. అన్నారు ఇందాకటి పెద్దావిడే. విసుగ్గా.
అందరం ..మా బ్యాగులతో పాటూ 'బంద్' ను కూడా భుజాన వేసుకొని నిలబడ్డాం మరో వాహనం కోసం ఎదురు చూస్తూ.
(సూర్యకుమారి)