లేడీ జేమ్స్‌బాండ్
ఆడవాళ్లకి ఆరాలు తీసే మనస్తత్వం ఉంటుందని జోకులేస్తుంటారు కొంతమంది. అయితే అది నవ్వాల్సిన విషయం కాదు, కామెంట్ చేయాల్సిన విషయం అంతకన్నా కాదు అంటారు రజనీ పండిట్. ఎందుకంటే ఆరాలు తీసే ఆ లక్షణమే ఆమె వృత్తిగా మారింది. ఆమెను డిటెక్టివ్‌గా మార్చింది. సెన్సేషనల్ లేడీ డిటెక్టివ్ అంటూ కితాబునిచ్చింది. ఎన్నో ప్రశంసలను, పురస్కారాలనూ తెచ్చిపెట్టింది.
ముంబైలోని శివాజీ పార్క్‌కి దగ్గరలో ఉంది రజనీ పండిట్ ప్రైవేట్ డిటెక్టివ్ ఆఫీసు. ఎంతో క్లిష్టమైన కేసులకు సైతం అతి తక్కువ ఫీజు తీసుకుంటారు రజని. అందుకే ఆమెకు డిటెక్టివ్‌గానే కాక మంచి మనిషిగా కూడా పేరుంది. ఆవిడ ఓ సాహస కెరటం. తన పనితనం గురించి తెలుసుకోవాలంటే ఆవిడ రాసిన ఫేసెస్ బిహైండ్ ఫేసెస్, మాయాజాల్ అనే పుస్తకాలు చదివితే సరి!
రజని పుట్టి పెరిగిందంతా మహారాష్ట్రలోని థానే జిల్లాలోనే. ఆవిడ తండ్రి ఓ సీఐడీ ఇన్స్పెక్టర్. ఆయన ప్రభావం రజని మీద చిన్ననాటనే పడింది. తండ్రి విచారణ జరిపే కేసులను ఆసక్తిగా పరిశీలించేవారు రజని. ఆయనను అడిగి మరీ కొన్ని విషయాలు తెలుసుకునేవారు. దాంతో ఆమెకి ఇన్వెస్టిగేషన్ పట్ల ఆసక్తి పెరిగిపోతూ వచ్చింది. ఆ ఆసక్తితోనే కాలేజీలో తన స్నేహితురాలి సమస్యను పరిష్కరించారామె. ఆ అమ్మాయి కొందరు చెడ్డ అబ్బాయిలతో తిరుగుతూ ఉండేది. ఎంత చెప్పినా వినేది కాదు. దాంతో అటెండర్ని అడిగి ఆ అమ్మాయి అడ్రస్ సంపాదించారు రజని. వాళ్ల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో విషయం చెప్పారు.
వాళ్లు నమ్మకపోతే తన సొంత డబ్బులతో ట్యాక్సీలో తీసుకెళ్లి మరీ ఆ అమ్మాయి చేసే పనులు చూపించారు. అప్పుడా అమ్మాయి తండ్రి ‘నువ్వు డిటెక్టివ్వా?’ అని అడిగాడు. ఆ ప్రశ్న రజని మనసులో బలంగా నాటుకుపోయింది. ఆమెను డిటెక్టివ్‌గా మార్చేందుకు దోహదపడింది. ఆ తర్వాత మరో మహిళ సమస్యను కూడా తన తెలివితేటలతో పరిష్కరించిన తర్వాత ఫుల్‌టైమ్ డిటెక్టివ్‌గా మారిపోవాలని నిర్ణయించుకున్నారు రజని.
అడుగడుగునా సవాళ్లే...
డిటెక్టివ్‌గా పని చేయడం అంత తేలికైన పని కాదు. ఒక్కో కేసు ప్రాణాల మీదకు తెచ్చేది. బెది రింపులు, వార్నింగులకు కొదువే లేదు. అయినా ఎన్నడూ వెనకడుగు వేయలేదు రజని. భయమనేది తన డిక్షనరీలోనే లేదంటారామె. భార్యను చంపా లనుకున్న భర్త ప్లాన్‌ను భగ్నం చేసినా... మరో పురుషుడితో సంబంధం పెట్టుకుని తన సొంత కొడుకునే కిడ్నాప్ చేసి, ఆపైన భర్తను డబ్బుకోసం బ్లాక్ మెయిల్ చేసిన భార్య పన్నాగాన్ని బయటపెట్టినా... సినిమా వాళ్ల అఫైర్ల కూపీ లాగినా... వ్యాపారవేత్తల మోసాలను బహిరంగపర్చినా... మిస్సింగ్ కేసుల మిస్టరీలు ఛేదించినా... హత్య కేసుల అంతు చూసినా... ఏం చేసినా పర్ఫెక్ట్గా చేశారు రజని. అనుకున్నదానికంటే వేగంగా ఉత్తమ ఫలితాలను అందించారు. అందుకే ఊహించనంత త్వరగా ఆమె పేరు దేశమంతా పాకిపోయింది. ఐదారు అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ‘లేడీ జేమ్స్‌బాండ్’ పేరుతో ఆమె మీద డాక్యుమెంటరీ సైతం తయారయ్యింది.
నలభై ఏడేళ్ల వయసులో సైతం ఇప్పటికీ చలాకీగా తిరుగుతూ, చకచకా కేసుల్ని పరిష్కరించే రజని పనితనం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. తన దగ్గరకు వచ్చేవాళ్లందరి సమస్యలూ తీర్చడంలో సంతోషాన్ని పొందే రజని... తన సొంత సమస్యలు వృత్తికి అడ్డు కాకూడదనుకున్నారు. అందుకే తన వ్యక్తి గత జీవితానికి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం అల వాటు చేసుకున్నారు. చివరికి పెళ్లి సైతం వద్దను కున్నారు. అంత త్యాగం అవసరమా అని ఎవరైనా అంటే... ‘పెళ్లే జీవితం అని నేను అనుకోలేదు.
పెళ్లిలోనే సంతోషం దొరకుతుందని నాకెప్పుడూ అనిపించనూ లేదు. కేసు సాల్వ్ చేసినప్పుడు కలిగే సంతోషం ముందు మిగతావన్నీ దిగదుడుపే నాకు’ అంటారామె మందహాసం చేస్తూ. నిజమే. పరులకు సాయపడటంలో సంతోషాన్ని వెతుక్కునేవారికి పర్సనల్ లైఫ్ ఎప్పుడూ ముఖ్యం కాదు... కాబోదు!!