భక్తుడిపై టీటీడీ భద్రతా సిబ్బంది దాష్టీకం
తిరుమల: సర్వదర్శనం క్యూలైన్లో శ్రీవారి దర్శనార్థం నిలుచున్న భక్తుడిపై టీటీడీ సిబ్బంది దాడిచేశారు. తమిళనాడు వేలూరుకు చెందిన పద్మనాభం అనే భక్తుడిపై టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అకారణంగా పిడిగుద్దులు కురిపించారు. భక్తుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
స్కానింగ్ కేంద్రం వద్ద దర్శనానికి వెళ్తుండగా విజిలెన్స్ సిబ్బంది, మహిళా సెక్యూరిటీ గార్డులు పద్మనాభంపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. దాంతో అతను అక్కడికక్కడే సొమ్మసిల్లిపడిపోయాడు. గమనించిన పోలీసులు అతనిని తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు విజిలెన్స్ సిబ్బందిని, ఇద్దరు మహిళా సెక్యూరిటీ గార్డులను, ఒక ఎస్పీఎఫ్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. పద్మనాభం పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.