పొట్టకొట్టారు
లైనుకొత్తూరులో 6 గంటలసేపు బైఠాయింపు
మూడు కేసులు నమోదు
యలమంచిలి: డ్వాక్రా రుణమాఫీ అమలు చేయకుండా మోసగించిన టీడీపీ ప్రభుత్వం ఉపాధి కూడా లేకుండా చేసిందని మహిళలు బుధవారం భారీ ఆందోళనకు దిగారు. యలమంచిలి మున్సిపాలిటీలో ఐదు విలీన గ్రామాలకు చెందిన 300 మంది మహిళలు లైనుకొత్తూరు స్త్రీశక్తి భవనం ఎదుట దాదాపు 6గంటలసేపు బైఠాయించారు. ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘాల నేతల మద్దతుతో చేపట్టిన ఈ ఆందోళనలో మహిళలు ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపాధి పథకం రద్దు చేసి నోటికాడ కూడు లాగేశారని, ఏడాదిన్నరగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా మా గోడు పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రలోభాలకు గురిచేసిన నాయకులంతా తాము ఆకలితో అల్లాడుతుంటే పట్టించుకోలేదు.. తమ కడుపు మంటను ఎవరు చల్లార్చుతారంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఏపీవో నిర్బంధం
ఎన్నిసార్లు ఆందోళన చేసినా దున్నపోతుమీద వర్షం పడిన చందంగా అధికారుల్లో చలనం లేదని ఐద్వా నాయకురాలు ఆడారి రాజేశ్వరి చెప్పారు. స్త్రీశక్తి భవనంలో విధి నిర్వహణలో ఉన్న ఏపీవో సత్యవతితో వాగ్వాదానికి దిగి ఆమెను నిర్బంధించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఆందోళన సాయంత్రం 4 గంటల వరకు ఆందోళన కొనసాగింది. చివరకు పోలీసులు ఆందోళనకారులను అక్కడ నుంచి పంపేయడానికి మహిళా కానిస్టేబుళ్లను ప్రయోగించారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది.
మున్సిపాలిటీ చేయడం వల్లే..
యలమంచిలి పట్టణాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంతో ఉపాధి హామీ పథకం అమలు నిలిచిపోయింది. దీంతో విలీన గ్రామాల్లో పేద కుటుంబాలకు చెందిన మహిళలు, ఇతరులు ఉపాధి కోల్పోయారు. రాజకీయ ప్రయోజనాల కోసమే యలమంచిలిని మున్సిపాలిటీగా మార్చారని, నిజానికి మున్సిపాలిటీగా మార్చేటంత జనాభా ఇక్కడలేరని ఆందోళనకారులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం, కొక్కిరాపల్లి, ఎర్రవరం, సోమలింగపాలెం, విఎన్పేట తదితర గ్రామాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. యలమంచిలి సీఐ కె.వెంకట్రావు, టౌన్, రూరల్ ఎస్ఐలు జి.బాలకృష్ణ, సిహెచ్.వెంకట్రావు, సిబ్బంది లైనుకొత్తూరులో స్త్రీశక్తి భవనం వద్ద ఉండి పరిస్థితి అదుపుతప్పకుండా జాగ్రత్తపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న నర్సీపట్నం ఏఎస్పీ ఐశ్వర్య రస్తోగి సాయంత్రం ఇక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
మూడు కేసులు నమోదు
ఉపాధి పథకం అమలు కోరుతూ మహిళలు చేపట్టిన ఆందోళనకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి. యలమంచిలి ఎంపీడీవో ఇ.సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐద్వా మండల నాయకురాలు ఆడారి రాజేశ్వరి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెంకన్న, సత్యనారాయణతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఏపీవో డి.వి.సత్యవతిపై దౌర్జన్యానికి దిగడంతో పాటు సిబ్బంది విధులు నిర్వహించకుండా అడ్డుకున్నట్టు ఎంపీడీవో ఫిర్యాదులో పేర్కొన్నారు. గాయపడిన ఏపీవోను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఆందోళనకారులు అడ్డుకున్నారని హెడ్‌కానిస్టేబుల్ నాగమణి ఇచ్చిన మరో ఫిర్యాదుపై కూడా కేసు నమోదు చేసినట్టు యలమంచిలి రూరల్ ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. ఐద్వా నేత ఆడారి రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఉపాధి హామీ పథకం అమలు చేయాలని కొందరు మహిళలను తీసుకుని కార్యాలయంలోకి వెళ్లిన తమపై ఏపీవో సత్యవతి దురుసుగా ప్రవర్తించి తనను చెంపపై కొట్టారని రాజేశ్వరి ఫిర్యాదులో పేర్కొన్నారు.