శవం కోసం ఎదురుచూపు
డిచ్పల్లి, న్యూస్‌లైన్ :మండలంలోని దూస్‌గాం పంచాయతీ పరిధిలో గల నడిమితండాకు చెందిన లకావత్ బంతిలాల్ (40) సౌదీఅరేబియాలో మృతిచెందినట్లు తండావాసులు తెలిపారు. తండావాసులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం... బంతిలాల్‌కు భార్య నీలాబాయి, కూతురు అనిత, కొడుకు అనిల్ ఉన్నారు. అనిల్‌కు కాళ్లు సరిగా లేకపోవడంతో నడవలేడు. కుటుంబ పోషణ, బతుకు దెరువు కోసం సుమారు 6 నెలల కిత్రం రూ.65 వేలు అప్పుచేసి బంతిలాల్ గల్ఫ్‌లోని సౌదీఅరేబియా దేశం వెళ్లాడు. అక్కడ దమ్మామ్ ప్రాంతంలోని ఒక కపిల్(షేక్) దగ్గర గొర్రెల కాపరిగా పనికి చేరాడు.
ఆరునెలల్లో కపిల్ బం తిలాల్‌కు ఒక్కసారి కూడా జీతం డబ్బులు ఇవ్వలేదు. కేవలం తినడానికి ఆహారం, నీళ్లు మాత్రమే ఇచ్చేవాడు. ఎడారిలోనే ఉంటూ గొర్రెలను కాసేవాడు. ఇటీవల జీతం గురించి అడిగితే రంజాన్ పూర్తికాగానే ఇస్తానని యజమాని హామీ ఇచ్చినట్లు భార్యకు సమాచారం ఇచ్చాడు. అయితే ఈనెల 10వ తేదీన బంతిలాల్ చనిపోయినట్లు తోటి గొర్రెల కాప రి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. దీంతో భార్యాపిల్ల లు దుఃఖంలో మునిగిపోయారు. ఈ విషయమై కపిల్‌కు ఫోన్‌చేయగా బంతిలాల్ అనారోగ్యంతో చికిత్సపొందుతూ ఆస్పత్రిలో మృతిచెందినట్లు సమాధానం ఇచ్చాడు.
సౌదీలో ఉంటున్న తండావాసు లు కొందరు కపిల్ వద్దకు వెళ్లి బంతిలాల్ మృతదేహాన్ని అప్పగించాలని అడుగగా, నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని కుటుం బసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు బంతిలాల్ ఎలా చనిపోయాడో తెలియడం లేదని, ఎవరైనా చంపేశారా అని కుటుం బసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని తొందరగా రప్పించాలని కోరుతూ ఎంపీ మధుయాష్కీగౌడ్ ద్వారా, కలెక్టరేట్ ద్వారా సౌదీలోని ఇండియన్ ఎంబీసీకి, ఢిల్లీలోని ఎంబసీకి లెటర్‌ను ఫ్యాక్స్ చేయించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి బంతిలాల్ ఎలా మృతిచెందాడనే విషయంపై విచారణ జరిపించాలని కోరారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని తండావాసులు, కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.