పాక్ జైల్లో మగ్గుతున్న 11 మంది భారతీయ ఖైదీల వినతి
హోషియార్పూర్ (పంజాబ్): అత్యంత దుర్భర పరిస్థితుల్లో జైల్లో మగ్గిపోతున్న తమకు చావు ప్రసాదించి.. నిస్సార జీవితం నుంచి విముక్తి కల్పించాలని పాకిస్థాన్లోని లాహోర్లో గల కోట్ లఖ్పత్ జైలులో ఏళ్లుగా కాలం గడుపుతున్న 11 మంది భారతీయ ఖైదీలు విజ్ఞప్తి చేశారు. తాము ఎటువంటి లక్ష్యం, ప్రయోజనం లేకుండా జీవచ్ఛవాల మాదిరిగా బతుకులీడుస్తున్నామని, అందువల్ల తమను కాల్చిచంపి.. ఈ దుర్భర జీవితం నుంచి విముక్తి కల్పించాలని వారు భారత్, పాకిస్థాన్ ప్రభుత్వాలకు విన్నవించారు.
ఈ మేరకు వారు సంయుక్తంగా రాసిన లేఖను బీజేపీ రాజ్యసభ సభ్యుడు అవినాష్ రాయ్ ఖన్నాకు పంపారు. లేఖ జిరాక్స్ కాపీలను ఖన్నా శుక్రవారమిక్కడ మీడియాకు అందజేశారు. కాగా నలుగురు మహిళలతోసహా మరో 21 మంది భారతీయ ఖైదీలు కూడా కోట్ లఖ్పత్ జైలులో మగ్గుతున్నారని, తీవ్రమైన చిత్రహింసలవల్ల వారికి మతిస్థిమితం తప్పిందని, వారి పేర్లను సైతం మరిచిపోయారని లేఖలో వివరించారు. పాక్ జైళ్లలో మగ్గుతున్న భారతీయ ఖైదీల సంఖ్య 200 వరకు ఉంటుంది.