రాష్ట్రవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వెలుగులు
హైదరాబాద్: కార్తీక పౌర్ణమి సందర్బంగా రాష్ట్రంలోని దేవాలయాలన్నీ కళకళలాడుతున్నాయి. భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లక్షల దీపాలతో వెలుగులు చిమ్ముతున్నాయి. ఖమ్మం జిల్లా భద్రాచలంలో గోదావరి తల్లికి హారతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మహాబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో వర్నే రామలింగేశ్వరాలయంలో లక్ష దీపాలంకరణ చేశారు. అచ్చంపేట మండలం ఉమామహేశ్వరం శివాలయం భక్తులతో కిట కిట లాడుతోంది. నిజామాబాద్ జిల్లా బీమ్గల్ నింబాద్రి గుట్టపై రథయాత్ర వైభవంగా నిర్వహించారు. రథంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని ఊరేగించారు. భక్తులు భారీగా తరలివచ్చారు.
కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం వాలుగొండలో లక్ష దీపారాధన కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయం వద్ద కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మునేరుకు హారతులు పట్టారు. వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల అయ్యప్ప స్వామి గుడిలో అయ్యప్ప స్వామి భక్తులు లక్ష ఎనిమిది దీపాలు వెలిగించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గోపాద క్షేత్రంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పండితులు మంగళహారతులు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా సింహగిరి క్షేత్ర పాలకుడు త్రిపురాంతక స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలాయాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జ్వాలా తోరణం ఉత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు క్షీరా రామలింగస్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో గుడ్డం రంగనాథస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. వేలాదిగా భక్తులు హాజరయ్యారు. కర్నూలు జిల్లాలోని మహానంది శైవక్షేత్రం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది.
ఇదిలా ఉండగా, తమిళనాడులోని తిరువణ్ణామలైలో కార్తీకదీపోత్సవం వైభవంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాన్ని తిలకించారు.