లక్ష బావులను తవ్వుతాం!
ముంబై: రానున్న కాలంలో కరువు సంభవించి నీళ్ల సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని, దాన్ని నివారించే దిశగా జలయజ్క్షానికి మహారాష్ట్ర ప్రభుత్వం వ్యూహారచన చేస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో ముందుగా లక్ష బావులు, 50వేల వ్యవసాయ చెరువులను తవ్వించే కార్యక్రమానికి పూనుకుంది. అనిశ్చితి కారణంగా సకాలంలో వర్షాలు పడకపోవడంతో అంతర జలవనరులు అంతరించిపోయే ప్రమాదం ఉందని భావిస్తోంది. దీని వల్ల వ్యవసాయానికి ఎక్కువ నష్టం కలుగుతుందని ప్రచారం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నీటి సంరక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి ఆగస్టు 15 నుంచి శ్రీకారం చుట్టనున్నట్టు గురువారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవింద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. ఈ కార్యక్రమం వల్ల అనేక రకాల ప్రయోజనాలున్నాయనీ, ముఖ్యంగా రాష్ట్రంలో 14 ఆత్మాహుతి పీడిత జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతేకాక ఈ తవ్వకాలు పూర్తియ్యే లోపు నీటిపారుదల కోసం మరో లక్ష బావులు, 50వేల వ్యవసాయ చెరువులను తవ్వించే కార్యక్రమాన్ని చేపడుతామని ఫడ్నవిస్ పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నీటిపారుదలకు, త్రాగునీరు సరఫరా చేయడం పెద్ద సమస్యగా మారిందని చెప్పారు. రాష్ట్రంలో రాజీవ్ గాంధీ జీవన్దాయి యోజన పథకం కింద ఆహార భద్రత, వ్యవసాయ రుణాలు వంటి పథకాలను పునర్నిర్మించాలని భావిస్తున్నట్టు ఫడ్నవిస్ తెలిపారు.