ఇంట్లో మూడు లక్షలు కాజేసి ఫ్రెండ్స్కిచ్చాడు..
చౌటుప్పల్ (మునుగోడు) : ఆడుకునే వయసు కలిగిన పిల్లలు పిల్లలు కలిసి ఓ ఇంటిని లూటీ చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడున్నర లక్షలు మాయం చేశారు. జాగ్రత్తగా పెట్టిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయో తెలియక సదరు ఇంటిపెద్ద నిత్యం పరేషాన్ అయ్యేవాడు. తన ఇంట్లో జరిగే ఘటనను ఛేదించాలని నిర్ణయించుకున్న అతను వల పన్నడంతో సుమారు మూడు నెలల పాటు జరిగిన ఈ తతంగానికి తెరపడింది. ఇందుకు సంబంధించి మంగళవారం గ్రామంలో పెద్దమనషుల సమక్షంలో పంచాయితీ ఏర్పాటు చేశారు.
ఈ ఘటన నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారంలో చోటుచేసుకుంది. వివరాలు... గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇళ్లను నిర్మాణం చేసి విక్రయిస్తుంటాడు. ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య గృహిణి కాగా, పెద్ద కుమారుడు తొమ్మిది, చిన్న కుమారుడు ఆరో తరగతి పూర్తి చేసుకున్నాడు. ఇంటిపెద్ద ఇటీవల వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బులను బీరువాలో భద్రపరుస్తున్నాడు. తర్వాత అవసరం నిమిత్తం డబ్బులు తీసుకునేందుకు బీరువాలో చూడగా కొన్ని డబ్బులు తక్కువ ఉంటున్నాయి. ఇలా మూడు నెలల నుంచి జరుగుతోంది. కుటుంబ సభ్యులందరినీ అడిగినా ఫలితం లేకుండా పోయింది.
పట్టుకునేందుకు పథకం..
బీరువాలో డబ్బులు మాయం అవుతున్న విషయాన్ని భార్య, ఇద్దరు కుమారులను నిలదీశాడు. ముగ్గురు సైతం తమకు ఏమీ తెలియదని చెప్పారు. ఈ సమయంలో పెద్ద కుమారుడు తన అమ్మమ్మ ఊరికి వెళ్లాడు. మరుసటి రోజే కొంత నగదు మాయమైంది. దీంతో ఆందోళనకు గురైన ఇంటి పెద్ద ఎలాగైన కనిపెట్టాలని భావించాడు. మరుసటి రోజు మరికొంత డబ్బు తెచ్చి బీరువా లో పెట్టి తాళం చెవి అక్కడే వేసి బయటికి వెళ్లాడు. కొంత సేపటి తర్వాత వచ్చి ఇంటి పరిసరాల్లో కూర్చొని గమనించసాగాడు. తండ్రి నిజంగానే వెళ్లిపోయాడని భావించిన చిన్నకుమారుడు బీరువాలో ఉన్న సొమ్మును తీసుకువచ్చి తన మిత్రుడికి ఇస్తున్నాడు. గమనించిన తండ్రి వెళ్లి పట్టుకున్నాడు. మందలించగా వివరాలు వెల్లడించాడు. ఈ బాలుడి వద్ద డబ్బులు తీసుకున్న వారిలో ఒకరు బైక్ కొనగా, మరికొందరు ఆండ్రాయిడ్ ఫోన్లు కొనుక్కున్నారు.
పెద్ద మనషుల నడుమ పంచాయితీ
కుమారుడి వద్ద డబ్బులు తీసుకున్న బాలుర వద్ద నుంచి తిరిగి డబ్బులు పొం దేందుకు బాధితుడు పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయితీ పెట్టాడు. ఇంట్లోనుంచి డబ్బులు తీసుకువచ్చిన బాలుడు ఎవరికి ఎంత ఇచ్చిన విషయం స్పష్టంగా పుస్తకంలో రాసుకున్నాడు. దాని ఆధారంగా సదరు బాలుర తల్లిదండ్రులను పిలిపించారు. మొత్తం ఐదుగురు బాలురు డబ్బులు తీసుకెళ్లారు. ఈ విషయం రుజువు కావడంతో అందరు కలిసి రూ.లక్షన్నర తిరిగి ఇచ్చేందుకు అంగీకరించారు. కాగా తన సొంత ఇంట్లో నుంచి బాలుడు డబ్బులు తీసుకువచ్చి మిత్రులకు ఎందుకిచ్చాడో ఎవరికీ అంతుచిక్కడం లేదు.