లక్నవరం చెరువును ఎవరు తవ్వించారు?
మొదటి బేతరాజు రాజ్యస్థాపనతో (క్రీ.శ.1000) ప్రారంభమైన కాకతీయుల పాలనకు క్రీ.శ. 1199లో మహాదేవరాజు మరణంతో తెరపడే పరిస్థితులు ఎదురయ్యాయి. దేవగిరి యాదవరాజు జైతుగీకి బందీ కావడం వల్ల కాకతీయ రాజు గణపతిదేవుడు పాలనను కొనసాగించలేకపోయాడు. ఇతడు దాదాపు 12 ఏళ్ల పాటు దేవగిరిలోనే బందీగా ఉన్నాడు. రేచర్ల రుద్రుడు కాకతీయ రాజ్యాన్ని ఈ సంక్షోభం నుంచి రక్షించాడు. అందువల్ల ఇతడికి ‘కాకతీయ రాజ్య ప్రతిష్ఠాపనాచార్య’ అనే బిరుదు వచ్చింది.
ఇతడు రేచర్ల రెడ్డి కుటుంబానికి చెందినవాడు. మహాదేవుడి దగ్గర సేనాధిపతిగా చేశాడు. రాజ్యాధికారానికి ఏ మాత్రం ఆశపడకుండా గణపతిదేవుడికి సేనాధిపతిగా ఉండి కాకతీయుల రాజ్యాన్ని గట్టెక్కించాడు. గణపతిదేవుడి నడవడికను గమనించిన జైతుగీ అతడిని విడుదల చేసి కాకతీయ రాజ్యాన్ని తిరిగి అప్పగించాడు. ఈ వివరాలు యాదవరాజైన రామచంద్రదేవుడి ‘దేవగిరి శాసనం’ ద్వారా తెలుస్తున్నాయి.
కాకతీయులు
గణపతిదేవుడు (క్రీ.శ. 1199-1263): ఇతడు కాకతీయులందరిలో సుప్రసిద్ధుడు. రేచర్ల రుద్రుడు నిలిపిన రాజ్యాన్ని విధేయత, విశ్వసనీయతతో గణపతిదేవుడు నలుదిక్కులా విస్తరించాడు. అప్పటికే చాలామంది కాకతీయుల సామంతరాజులు రాజ్య సంక్షోభాన్ని ఆసరా చేసుకొని స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. మల్యాల చౌడ సేనాని నాయకత్వంలో కాకతీయులు దివిసీమను ఆక్రమించారు. దివిసీమ రాజు పిన్నచోడుడు. అతడి కుమార్తెలు నారాంబ, పేరాంబను గణపతిదేవుడు వివాహం చేసుకున్నాడు. పిన్నచోడుడి కుమారుడైన ‘జాయపసేనాని’ని ‘గజసాహిణి’గా నియమించాడు. జాయాపసేనాని ‘నృత్తరత్నావళి’ అనే గ్రంథాన్ని రచించాడు. ‘పేరిణి’ నృత్య రూపాల గురించి ఈ గ్రంథంలో తెలిపాడు.
మల్యాల చౌడ సేనానిని ‘చాముండరాయుడి’గా కూడా పిలుస్తారు. ఇతడి నాయకత్వంలోనే కాకతీయ సైన్యం వెలనాడును పాలిస్తున్న పృథ్వీశ్వరుడిని ఓడించింది. వెలనాటి వంశం పూర్తిగా అంతరించింది. చోళ రాజైన మొదటి మనుమసిద్ధి కుమారుడు తిక్కభూపాలుడు. నెల్లూరును పాలిస్తున్న నల్లసిద్ధి, తమ్ముసిద్ధిపై దాడి చేసిన గణపతిదేవుడు వారిని తొలగించి తిక్కభూపాలుడిని (తిక్కసిద్ధి) సింహాసనం అధిష్టింపజేశాడు. దీనికి ప్రతిఫలంగా తిక్కసిద్ధి కాకతీయులకు ‘పాకనాటి’ని బహుమానంగా ఇచ్చాడు. కాకతీయ సేనాని ‘గంగసాహిణి’ని ఇక్కడ అధిపతిగా నియమించారు.
తిక్కభూపాలుడు మరణించిన తర్వాత (క్రీ.శ. 1248) అతడి కుమారుడైన రెండో మనుమసిద్ధి పాలనలోకి వచ్చాడు. చోళరాజు మూడో రాజరాజు, కర్ణాటక రాజు వీర సోమేశ్వరుడి సహకారంతో విజయగండ గోపాలుడనే రాజు రెండో మనుమసిద్ధిపై దాడిచేశాడు. ఈ దాడిలో మనుమసిద్ధికి సామంత ప్రభువులుగా ఉన్న అక్కన, బయ్యన తిరుగుబాటు చేసి విజయగండ గోపాలుడికి సహాయం చేశారు. ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులో అనువదించిన కవిత్రయంలో ఒకరైన తిక్కన రెండో మనుమసిద్ధి ఆస్థానంలోనే ఉండేవారు. ఈయన మనుమసిద్ధి రాయబారిగా గణపతిదేవుడి ఆస్థానానికి వెళ్లి సహాయం అర్థించాడు.
గణపతిదేవుడు ‘సామంతభోజుడు’ అనే సైన్యాధికారి నాయకత్వంలో కాకతీయ సైన్యాన్ని నెల్లూరుకు పంపాడు. అక్కన, బయ్యనను వధించిన కాకతీయ సైన్యం చోళరాజును, కర్ణాటక ప్రభువును, విజయగండ గోపాలుడిని ఓడించింది. క్రీ.శ.1250లో కాకతీయులు కాంచీపురాన్ని ఆక్రమించుకున్నారు. ఇది ‘వలమూరు’ యుద్ధంగా ప్రసిద్ధి కెక్కింది. రెండో మనుమసిద్ధిని నెల్లూరు రాజుగా, కాకతీయ సేనాని గంగమ సాహిణిని మార్జవాడి (కడప) ప్రాంతం అధిపతిగా నియమించారు. గణపతి దేవుడు కళింగ రాజ్య ఆక్రమణకు కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు.
పాండ్య రాజైన జటావర్మ సుందర పాండ్యుడు, వీర గండగోపాలుడు, కొప్పెర జింగుడు కలిసి మొదట కాంచీపురాన్ని, తర్వాత నెల్లూరును ఆక్రమించారు. మనుమసిద్ధికి సాయంగా వచ్చిన గణపతిదేవుడి కాకతీయ సైన్యాలు పరాజయం పాలయ్యాయి. క్రీ.శ. 1263లో జరిగిన ఈ ‘ముత్తుకూరు’ యుద్ధంలో రెండో మనుమసిద్ధి మరణించాడు. ఈ ఘోర ఓటమితో కుంగిపోయిన గణపతిదేవుడు రాజకీయ రంగం నుంచి నిష్ర్కమించాడు.
కాకతీయుల కీర్తి ప్రతిష్టను దేశమంతా వ్యాపింపజేసిన గణపతిదేవుడి పాలన కాలానికి మంచి గుర్తింపు ఉంది. ఇతడి గురువు విశ్వేశ్వర శివదేవుడు. జాయపసేనాని వేయించిన చేబ్రోలు శాసనం గణపతిదేవుడి పాలన గురించి తెలియజేస్తోంది. బంగాళాఖాతం తీరంలో ఉన్న మోటుపల్లి రేవును వాణిజ్యానికి అనుగుణంగా అభివృద్ధి చేశాడు. విదేశీ వ్యాపారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి వీలుగా ‘అభయ శాసనం’ అనే పేరుతో కట్టుదిట్టమైన నిబంధనలను అమలు చేశాడు. మోటుపల్లి రేవు అధిపతిగా ఉన్న సిద్ధయ్యదేవుడనే సేనానికి దీని పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించాడు.
రుద్రదేవుడు పునాది వేసిన ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేశాడు. కాకతీయ రాజధానిని హన్మకొండ నుంచి ఓరుగల్లు కోటకు క్రీ.శ. 1254లో మార్చాడు. పిల్లలమర్రి, పాలంపేట (రామప్ప), కొండపల్లి, నాగులపాడు, ఓరుగల్లులోని స్వయంభూ దేవాలయాలు గణపతిదేవుని కాలంలో నిర్మించిన గొప్ప శిల్పకళా నిలయాలు. రేచర్ల రుద్రుడి స్వయం పర్యవేక్షణలో నిర్మించిన పాలంపేటలోని రామప్ప దేవాలయం ముఖ్యమైంది. గణపతిదేవుడు వ్యవసాయాభివృద్ధికి రామప్ప, పాకాల, లక్నవరం, నెల్లూరు చెరువులను తవ్వించాడు.
గణపతిదేవుడికి మగ సంతానం లేకపోవడం వల్ల పెద్ద కుమార్తె రుద్రమదేవిని సింహాసనమెక్కించి అతడు మరణించేంతవరకూ (క్రీ.శ. 1269) సహపాలన చేశాడు. రుద్రమాంబను చాళుక్య వీరభద్రుడు, చిన్న కూతురైన గణపాంబను కోట బేతరాజు వివాహమాడారు. వీరభద్రుడు ‘నిడదవోలు’ (పశ్చిమ గోదావరి) పాలకుడు.
రుద్రమదేవి (1263-1289): తెలుగు ప్రాంతాన్ని పాలించిన మొట్టమొదటి మహిళ రుద్రమదేవి. ‘రుద్రమహారాజ’ అనే బిరుదుతో కాకతీయ సింహాసనాన్ని అధిష్టించారు. ఈమె పాలన మొత్తం యుద్ధాలతోనే గడిచింది. మహిళా పాలనను సహించలేని అనేక సామంతరాజులు, చిన్న చిన్న ప్రభువులు తిరుగుబాటు చేశారు. ఈ బలహీనతను గమనించిన శత్రురాజులు కాకతీయ రాజ్యంపై దండెత్తడం ప్రారంభించారు. వీరిలో ముఖ్యులు పాండ్యులు, యాదవులు, తూర్పు గాంగులు (కళింగులు).
కళింగ రాజైన భానుదేవున్ని కాకతీయ సైన్యం పొట్ట పోతినాయకుడు ప్రోలయ నాయకుడు అనే సేనానుల నాయకత్వంలో ఓడించారు. దేవగిరి యాదవరాజు మహాదేవుడు వరంగల్పైకి దండెత్తగా, రుద్రమదేవి స్వయంగా పోరాడి అతడిని ఓడించారు. ఈ విజయంలో కాకతీయ సేనాని గోనా గన్నారెడ్డి పాత్ర గణనీయమైంది. ఈ యుద్ధ విజయానికి చిహ్నంగా రుద్రమదేవి ‘రాయగజకేసరి’ అనే బిరుదు పొందారు. ఈ విషయాలు విద్యానాథుడు రచించిన ప్రతాపరుద్ర చరిత్ర, రుద్రమదేవి వేయించిన బీదర్ శాసనం ద్వారా తెలుస్తున్నాయి.
గణపతి దేవుడి వద్ద సేనానిగా పనిచేసిన ‘గంగమసాహిణి’ మూలపురుషుడిగా ‘కాయస్థ వంశ’ పాలన ఆరంభమైంది. వీరి రాజధాని వెల్లూరు (తమిళనాడు). వీరి వారసులైన కాయస్థ జగదేవుడు, కాయస్థ త్రిపురాంతకుడు రుద్రమకు విధేయులుగానే ఉన్నారు. కానీ కాయస్థ రాజైన అంబదేవుడు స్వాతంత్య్రాన్ని కోరుకొని కాకతీయులపై తిరుగుబాటు చేశాడు. ఇతడు పాండ్యులు, యాదవరాజులతో స్నేహం చేస్తూ రుద్రమను ధిక్కరించి తూర్పు దక్షిణ ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు.
అంబదేవుడిని అణచడానికి మల్లిఖార్జునుడు అనే సేనాని నాయకత్వంలో రుద్రమదేవి స్వయంగా దండయాత్రకు వెళ్లారు. క్రీ.శ. 1289లో జరిగిన ఈ యుద్ధంలో రుద్రమ మరణించినట్లుగా తెలుస్తోంది. క్రీ.శ. 1289లో వేయించిన చందుపట్ల (నల్గొండ) శాసనం, క్రీ.శ. 1290లో అంబదేవుడు వేయించిన త్రిపురాంతక శాసనం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. రుద్రమ పాలనా కాలంలో వెనిస్ యాత్రికుడైన మార్కోపోలో మోటుపల్లి రేవును సందర్శించాడు. ఇతడు తన రచనల్లో కాకతీయరాజ్యం సుభిక్షంగా ఉందని వర్ణించాడు.
మార్కోపోలోకు ‘పయోనీర్ ఆఫ్ ట్రావెల్స్’ అనే బిరుదు ఉంది. రుద్రమదేవి ఓరుగల్లు కోటకు మరమ్మతులు చేసి శత్రు దుర్భేద్యంగా మార్చారు. కాకతీయ సేనానులైన కాయస్థ జన్నిగదేవుడు, త్రిపురాంతకుడు, గోన గన్నారెడ్డి, ప్రసాదిత్య నాయకుడు, రుద్రమ నాయకుడు, బెండమూడి అన్నయ్య రుద్రమదేవికి అండగా ఉంటూ ఆమె విజయాలకు నాయకత్వం వహించారు. రుద్రమదేవికి మగ సంతానం లేదు. ముమ్మడమ్మ, రుద్రమ్మ, రుయ్యమ్మ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముమ్మడమ్మ, కాకతీయ యువరాజు మహాదేవుడి కుమారుడైన ప్రతాపరుద్రుడు (రుద్రమదేవి మనువడు) కాకతీయ సింహాసనాన్ని అధిష్టించాడు.
ప్రతాపరుద్రుడు (1289-1323): ఇతడిని రెండో ప్రతాపరుద్రుడిగా, రుద్రదేవుడిని మొదటి ప్రతాపరుద్రుడిగా పిలుస్తారు. కాకతీయ పాలకుల్లో చివరివాడైన ఇతడి కాలంలో సామ్రాజ్యం ఉన్నత స్థితికి చేరుకుంది. ఇతడు కాయస్థ అంబదేవుడిని, యాదవ రాజులనూ ఓడించాడు. కాకతీయ సామంతరాజైన గోన విఠలుడు రాయచూరు దుర్గాన్ని నిర్మించాడు. వర్ధమాన పురం శాసనం (మహబూబ్‌నగర్) ద్వారా ఈ విషయాలు తెలుస్తున్నాయి.
దక్షిణ భారతదేశంపై ముస్లింల దండయాత్ర మొదటిసారిగా యాదవరాజుల రాజధాని ‘దేవగిరి’పై క్రీ.శ. 1295లో జరిగింది. యాదవ రామచంద్రదేవుడు లొంగిపోయి ఢిల్లీ సుల్తాన్‌కు కప్పం చెల్లించడానికి అంగీకరించాడు. క్రీ.శ. 1303లో తురుష్కుల చూపు ఓరుగల్లుపై పడింది. అప్పటి నుంచి క్రీ.శ. 1323 వరకు ఐదుసార్లు ముస్లిం రాజులు కాకతీయులపై దండయాత్ర చేశారు. కాకతీయులపై దండెత్తిన మొదటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. క్రీ.శ. 1303లో మాలిక్ ఫకృద్దీన్ జూనా నాయకత్వంలో ఢిల్లీ సైన్యాలు బెంగాల్ మీదుగా ఓరుగల్లుపై దాడి చేశాయి. ఈ సైన్యాన్ని ఉప్పరపల్లి (కరీంనగర్) వద్ద కాకతీయ సైన్యం ఓడించింది.
ప్రతీకారంతో ఉన్న అల్లావుద్దీన్ సైన్యం క్రీ.శ. 1309-10లో ‘మాలిక్ కపూర్’ నాయకత్వంలో ఓరుగల్లు కోటను ముట్టడించారు. 25 రోజుల ముట్టడి అనంతరం ప్రతాపరుద్రుడు లొంగిపోయి కప్పం చెల్లించడానికి అంగీకరించాడు. క్రీ.శ. 1311 లో అల్లావుద్దీన్ ఆదేశం మేరకు ప్రతాపరుద్రుడు పాండ్యులపై దండయాత్రకు పూనుకున్నాడు. ప్రతాప రుద్రుడు స్వయంగా నాయకత్వం వహించిన కాకతీయ సైన్యం కాంచీపురం వరకు సాగి ఆ ప్రాంతాన్నంతా ఆక్రమించుకుంది. అల్లావుద్దీన్ క్రీ.శ. 1316లో మరణించడంతో ప్రతాపరుద్రుడు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకొని ఢిల్లీ సుల్తాన్లకు కప్పం చెల్లించడానికి నిరాకరించాడు.
క్రీ.శ. 1318లో ఢిల్లీ సుల్తాన్ కుతుబుద్దీన్ ముబారక్ ఖిల్జీ సైన్యం ‘ఖుస్రూఖాన్’ నాయకత్వంలో ఓరుగల్లుపై దాడి చేశాడు. అప్పుడు ప్రతాపరుద్రుడు భయపడి తిరిగి కప్పం చెల్లించడం ప్రారంభించాడు. ఢిల్లీ సింహాసనాన్ని తుగ్లక్‌లు (క్రీ.శ.1320 వశపర్చుకున్న తర్వాత ప్రతాపరుద్రుడు కప్పం ఎగవేశాడు. దీంతో కోపగించిన ఘీయాసుద్దీన్ తుగ్లక్.. కుమారుడైన మహ్మద్‌బిన్ తుగ్లక్ (జునాఖాన్)ను ఓరుగల్లుపైకి పంపాడు.
క్రీ.శ. 1323లో జరిగిన ఈ దాడి ఢిల్లీ సింహాసన అంతర్గత కారణాల వల్ల సైన్యాలు వెనక్కి తగ్గి మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత జునాఖాన్ విస్తృత సైన్యంతో ఓరుగల్లు కోటపై దాడి చేసి దాన్ని ఆక్రమించాడు. ఢిల్లీ అమీరులైన ఖాదర్‌ఖాన్, ఖ్వాజాహజీ ప్రతాపరుద్రుడిని బందీగా ఢిల్లీకి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో సోమోద్భవ (నర్మదా) నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
దీంతో ఓరుగల్లుపై కాకతీయుల పాలన అంతమైంది. కాకతీయ రాజ్యం ఢిల్లీ సుల్తాన్ల ఆధిపత్యంలోకి వెళ్లింది. ఈ విషయాలు ముసునూరి ప్రోలయ నాయకుని విలాస తామ్రశాసనం, అతడి తల్లి కలువచేరు శాసనం ద్వారా తెలుస్తున్నాయి. ప్రతాప రుద్రుడికి కూడా రాయగజకేసరి అనే బిరుదు ఉంది. ఇతడి ఆస్థాన కవి విద్యానాథుడు సంస్కృతంలో ‘ప్రతాపరుద్ర యశోభూషణం’ అనే అలంకార గ్రంథాన్ని రాశాడు. పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రతాపరుద్రుడు నాయంకర విధానాన్ని పునరుద్ధరించాడు. కేవలం పద్మనాయకులనే నాయంకరులుగా నియమించాడు.
ఈ నాయంకరులు వారి ఆధిపత్యంలోని ప్రాంతాలకు అధిపతులుగా ఉంటూ బలోపేతమయ్యారు. ఈ వ్యవస్థ పాలనా వికేంద్రీకరణను తెలియజేస్తుంది. వీరికి సొంత సైన్యం ఉండేది. వీరి జాగీర్లలోని శాంతి భద్రతలను కూడా వీరే చూసేవారు. ప్రతాపరుద్రుడి కాలంలో 75 మంది నాయంకరులు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాకతీయుల పాలన అనంతరం రెడ్డి, వెలమలకు చెందిన ఈ బలమైన నాయంకరులు రాజులుగా చెలామణిలోకి వచ్చారు. వీరు ఢిల్లీ సుల్తాన్లకు కప్పం చెల్లిస్తూ తమ ప్రాంతాలను స్వతంత్రంగా పాలించుకున్నారు.
మాదిరి ప్రశ్నలు
1. ‘కాకతీయ రాజ్య ప్రతిష్ఠాపనాచార్య’ బిరుదు ఎవరిది?
1) రేచర్ల రుద్రుడు
2) కాపయ నాయకుడు
3) రేచర్ల ప్రసాదిత్యుడు
4) రుద్రమదేవి
2. రామప్ప దేవాలయాన్ని ఎవరి కాలంలో నిర్మించారు?
1) ప్రతాపరుద్రుడు 2) గణపతిదేవుడు
3) రుద్రమదేవి 4) రుద్రదేవుడు
3. రెండో మనుమసిద్ధి ఆస్థానకవి?
1) నన్నయ 2) ఎర్రన
3) పోతన 4) తిక్కన
4. ఏ యుద్ధంలో ఓడిపోవడం వల్ల గణపతి దేవుడు కుంగిపోయాడు?
1) వలయూరు 2) ముత్తుకూరు
3) నాగులపాడు 4) వెల్లూరు
5. రామప్ప, పాకాల, లక్నవరం చెరువులను తవ్వించిందెవరు?
1) మొదటి ప్రతాపరుద్రుడు
2) రెండో ప్రతాపరుద్రుడు
3) గణపతి దేవుడు 4) రుద్రదేవుడు
సమాధానాలు
1) 1; 2) 2; 3) 4; 4) 2; 5) 3.