నమో చెన్నకేశవా..
ధర్మవరం అర్బన్ :
ధర్మవరంలో లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో సోమవారం రథోత్సవం వైభవంగా జరిగింది. జిల్లా నుంచే కాక కర్ణాటక, హైదరాబాద్, కర్నూలు, కడప తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలు గజ వాహనంపై పురవీధులలో ఊరేగుతూ తేరుబజార్‌కు చేరుకున్నాయి. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి వారిని కొలువుదీర్చి ఉదయం మడుగుతేరు, సాయంత్రం రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ మడుగు తేరు(రథోత్సవం)కు ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఆర్డీఓ బాలానాయక్, జూనియర్ సివిల్ జడ్జి లీలావతి, మున్సిపల్ కమిషనర్ నాగమోహన్, వైస్‌చైర్మన్ శ్రీనివాసులు, ఎంపీపీ వేణుగోపాల్‌రెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు కలవల రామ్‌కుమార్, ఈఓ ఆనంద్, అయ్యప్పస్వామి సేవా కమిటీ అధ్యక్షుడు కలవల నాగరాజు తదితరులు మడుగుతేరు పూజల్లో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. వీరందరికీ ప్రధాన అర్చకులు కోనేరాచార్యులు కండువాలతో సత్కరించారు. సాయంత్రం 6 గంటలకు ధూళోత్సవం నిర్వహించారు.