లక్ష్మీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
జూపాడుబంగ్లా : తర్తూరు లక్ష్మీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు పూలచపురం కార్యక్రమంలో భాగంగా స్వామివారు పెళ్లి కుమారుడిగా ముస్తాబయ్యారు. ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం వేదమంత్రాల మధ్య çపట్టువస్త్రాలతో స్వామివారిని పెళ్లికుమారుడిగా తీర్చిదిద్దారు. స్వామివారు తర్తూరులో పెళ్లికుమారుడిగా ముస్తాబైన అనంతరం ఇక్కడ పదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ స్వామివారికి కల్యాణం నిర్వహించకపోవటంతో బ్రహ్మోత్సవాల అనంతరం స్వామివారు నెల్లూరు జిల్లాల్లోని శ్రీరంగాపురంలో జరిగే కల్యాణవేడుకలకు తరలివెళ్తారని పూజారులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, భక్తులకు అన్నదానం నిర్వహించారు.
పట్టువస్త్రాలు సమర్పించిన ఆర్ఐ..
లక్ష్మిరంగనాథస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధీంద్ర సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
నేడు సింహవాహనసేవ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజైన గురువారం స్వామివారికి సింహవాహనసేవ నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి వెంకటరెడ్డి, ఈఓ సుబ్రమణ్యంనాయుడు, చైర్మన్ రాయపుచిన్నరంగారెడ్డి తెలిపారు.