ప్రధాని సభ ముందు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్!
హైదరాబాద్: ఎల్బీ స్టేడియం ఆవరణలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, మాజీ మావోయిస్టులు దర్శనం ఇస్తున్నారు. అయ్యబాబోయ్ అని అవాక్కవుతున్నారా.. భయపడకండి వారు కనిపిస్తున్నది ఫొటోల రూపంలో. ఎల్బీ స్టేడియంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రధాన అతిథిగా ఇతర కేంద్రమంత్రులు ఇతర నాయకులు ఆహ్వానితులుగా బీజేపీ మహా సమ్మేళన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా భద్రతలో భాగంగా పోలీసుల చేతుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, మాజీ మావోయిస్టుల ఫోటోలు కనిపిస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా సభకు వొచ్చే ప్రతి కార్యకర్తను తమ చేతిలోని ఫొటోలతో పోల్చి చూస్తూ సభకు అనుమతిస్తున్నారు. అనుమానం వచ్చినవారిని పక్కకు తీసుకెళ్లి గుర్తింపు కార్డులు తనిఖీ చేస్తున్నారు. అన్ని ఆధారాలు సక్రమంగా ఉంటేనే సిటీ పోలీసులు లోపలికి అనుమతి ఇస్తున్నారు.