laljanbasha
-
లాల్‌జాన్ భాషా మృతి పట్ల వైఎస్ విజయమ్మ సంతాపం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు లాల్‌జాన్ భాషా మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మైనార్టీలకు లాల్‌జాన్ భాషా అంకిత భావంతో సేవలందించారని కొనియాడారు. ఎంపీగా ఆయన పలు సమస్యలపై స్పందించి ప్రజాహిత రాజకీయాల్లో కొనసాగారని విజయమ్మ తెలిపారు. నిరాడంబరుడు, సౌమ్యుడైన లాల్‌జాన్ భాషా ప్రమాదంలో మరణించడం మనసును కలచి వేసిందన్నారు. నార్కెట్‌పల్లి సమీపంలో కామినేని ఆసుపత్రి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లాల్‌జాన్‌బాషా మృతి చెందిన విషయం సంగతి తెలిసిందే. నల్గొండ నుంచి గుంటూరు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు డీవైడర్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందగా, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. -
రోడ్డు ప్రమాదంలో లాల్‌జాన్‌బాషా దుర్మరణం
నార్కెట్‌పల్లి సమీపంలో కామినేని ఆసుపత్రి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు లాల్‌జాన్‌బాషా మృతి చెందారు. నల్గొండ నుంచి గుంటూరు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు కామినేని ఆసుపత్రి వద్ద డీవైడర్‌ను ఢీ కొట్టడంతో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందగా, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్తానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాషా మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాషా మృతి చెందిన వార్త తెలియగానే నకరేకల్ ఎమ్మెల్యే తిరుమర్తి లింగయ్య, టీడీపీ నేతలు ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే లాల్‌జాన్‌బాషా మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆ పార్టీ నేతలు బాషా మృతికి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. బాషా మృతితో గుంటూరు జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. పార్టీ ఓ మంచి నేతను కొల్పోయిందని నరసరావు పేట ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి తన సంతపం ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 1984లో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ లోక్‌సభలో అడుగుపెట్టారు. 1991లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో రాజకీయ కురువృద్ధుడు ఎన్జీరంగాను ఓడించారు. అనంతరం ఆయన రాజ్యసభ సభ్యునిగా కూడా ఓ పర్యాయం పనిచేశారు.