ల్యాంకో, స్పెక్ట్రం ప్లాంట్లకు గ్యాసు నిలిపివేత
* నగరం ఘటన నేపథ్యంలో గెయిల్ నిర్ణయం
* నిలిచిన 235 మెగావాట్ల విద్యుత్
* యూనిట్ విద్యుత్ రాకున్నా రోజుకు రూ. 60 లక్షల భారం
సాక్షి, హైదరాబాద్: ల్యాంకో, స్పెక్ట్రం ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఈ ప్లాంట్లకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) గ్యాసు సరఫరాను నిలిపివేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా, నగరం గ్రామం వద్ద పేలుడు నేపథ్యంలో పైపులైన్‌ను పరీక్షించనున్న నేపథ్యంలో గ్యాసు సరఫరాను నిలిపివేస్తున్నట్టు ఈ ప్లాంట్లకు గెయిల్ శుక్రవారం సమాచారం అందించింది. పైపులైన్ పరీక్షలు, మరమ్మతుల అనంతరమే గ్యాసును తిరిగి సరఫరా చేస్తామని గెయిల్ స్పష్టం చేసింది. అప్పటివరకు ఈ రెండు ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోనుంది. ఫలితంగా 235 మెగావాట్ల (రోజుకు 6 మిలియన్ యూనిట్లు) విద్యుత్ ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. ఫలితంగా తెలంగాణకు 126 మెగావాట్లు, ఆంధ్రప్రదేశ్‌కు 109 మెగావాట్ల మేరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఓఎన్జీసీ, రవ్వ క్షేత్రాల నుంచి వస్తున్న గ్యాసుతో కేవలం కొన్ని ప్లాంట్లు మాత్రమే నడుస్తున్నాయి. తాజా ఘటనతో ఆ ప్లాంట్లు కూడా మూతపడే పరిస్థితి ఏర్పడింది.
స్థిర చార్జీలు చెల్లించాల్సిందే!
గ్యాసు ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన్పటికీ స్థిర చార్జీలను మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాంట్లతో విద్యుత్ సంస్థలు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) మేరకు కంపెనీ సొంత తప్పిదం లేకుండా బలవంతంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతే (ఫోర్జ్ మెజర్) స్థిర చార్జీలను సదరు కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రస్తుతం ప్లాంట్లకు సంబంధం లేకుండా బలవంతంగా మూయించడం వల్ల యూనిట్‌కు రూపాయి చొప్పున స్థిర చార్జీలను ఇరు రాష్ట్రాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే మొత్తం 6 మిలియన్ యూనిట్ల (60 లక్షల యూనిట్లు)కుగానూ ఒక్క యూనిట్ విద్యుత్ సరఫరా కాకున్నా రోజుకు 60 లక్షల రూపాయలను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.