ఎయిమ్స్ స్థల పరిశీలనకు రెండు రోజుల్లో కమిటీ
విజయవాడ: ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) స్థల పరిశీలన కోసం రెండు రోజుల్లో ఢిల్లీ నుంచి పరిశీలన కమిటీ రానున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. సోమవారం విజయవాడ ప్రభుత్వాస్పత్రి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎయిమ్స్ రాకతో ఈ ప్రాంతం వైద్యపరంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.1,200 కోట్లు ఇవ్వనుందని, ఇందుకోసం కమిటీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు స్థలాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రులతో పాటు ప్రభుత్వాస్పత్రుల పనితీరుపై సమీక్ష జరిపి వసతులు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని, దీనికి సంబంధించి ఒక ప్రణాళికను రూపొందించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేస్తామన్నారు.
ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగులతో వైద్యులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యు. సూర్యకుమారి పాల్గొన్నారు.