డీఎల్ఎఫ్కు సీబీఐ క్లీన్చిట్!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్కు నిర్మాణ అనుమతుల కేసులో సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కు సమీపంలోని స్థలంలో డీఎల్ఎఫ్ లగ్జరీ అపార్ట్మెంట్ సముదాయాన్ని నిర్మించడానికి అనుమతులివ్వడంపై దుమారం చెలరేగడం, భదత్రపరమైన ఆందోళనలు నెలకొనటంతో సీబీఐ దీనిపై ప్రాథమిక దర్యాప్తు (పీఈ) చేపట్టింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు (సీవీసీ) అందిన ఫిర్యాదుతో పట్టణాభివృద్ధి శాఖకు చెందిన కొందరు అధికారులపై గతేడాది జూలైలో సీబీఐ విచారణ ఆరంభించింది. ముఖ్యంగా డెయిరీ ఫార్మింగ్ కోసం ఉద్దేశించిన ఈ స్థలాన్ని అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం మార్చుకునేలా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చారనేది ఆరోపణ.
అయితే, ఈ కేసులో ఎలాంటి నేరపూరిత అంశాలూ లేవని తేలినట్లు సీబీఐ అత్యున్నత స్థాయి వర్గాలు మంగళవారం వెల్లడించాయి. దీంతో విచారణను ముగిస్తున్నట్లు కూడా పేర్కొన్నాయి. డీఎల్ఎఫ్ పదేళ్ల క్రితం ఈకేఎస్పీఎల్ అనే సంస్థను కొనుగోలు చేసింది. దీంతో ఈకేఎస్పీఎల్కు రాష్ట్రపతి భవన్ సమీపంలో ఉన్న 22.9 ఎకరాల డెయిరీ ఫార్మ్ స్థలం కూడా డీఎల్ఎఫ్కు దక్కింది. ఈ స్థలంలో నాలుగంతస్తుల లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మించడానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది.
దీనిపై నమోదైన కేసులో ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం కూడా కంపెనీకి అనుకూలంగా తీర్పిచ్చింది. ప్రభుత్వానికి మార్పిడి చార్జీల కింద రూ.1,200 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేయడంతో గ్రీన్ సిగ్నల్ లభించింది. మరోపక్క, ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు జరిపించేందుకు ప్రత్యేక దర్యాప్తు బందాన్ని(సిట్) ఏర్పాటు చేయటంపై దృష్టి సారించాలని బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు.