నేడు దళితులకు భూపంపిణీ
నీలగిరి : భూమిలేని నిరుపేద దళితులకు మూడెకరాల భూపంపిణీ కార్యక్రమం పంద్రాగస్టు సందర్భంగా లాంఛనంగా ప్రారంభం కానుంది. కనగల్ మం డలం హైదలపూర్‌కు చెందిన ఆరుగురు మహిళా లబ్ధిదారులకు హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శుక్రవారం భూపట్టాలు అందజేయనున్నారు. జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్స్‌లో మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి భూపంపిణీకి శ్రీకారం చుడతారు. అయితే తొలుత అనుకున్న ప్రకారం ఎంపిక చేసిన మొత్తం లబ్ధిదారులకు కాకుండా, గ్రామానికి ఇద్దరికి మాత్రమే శుక్రవారం మంజూరు పత్రాలు ఇవ్వనున్నారు. భూముల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయడంలో జాప్యం జరిగింది. దీంతో లబ్ధిదారుల పేరు మీద భూముల రిజిస్ట్రేషన్లు చేయించలేకపోయారు.
దీంతో ఎంపిక చేసిన లబ్ధిదారులకు భూపట్టాలు కాకుండా, మంజూరు పత్రాలను మాత్రమే అందజేస్తారు. అదీగాక పలుచోట్ల భూముల కొనుగోలు విషయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు అసలు భూమిలేని వారిని, 12 నియోజకవర్గాల్లో 261 మంది లబ్ధిదారులు ఎంపిక చేశారు. వాస్తవంగా వీరికి 697 ఎకరాలు భూమి అవసరం ఉంది. దీంట్లో ప్రభుత్వం భూమి 261 ఎకరాలు కాగా, 436 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఒక్కో ఎకరాకు ధర రూ.3లక్షలుగా నిర్ణయించింది. అయితే చాలా చోట్ల మూడు లక్షలకు మించి మార్కెట్ ధర ఉంది. భూమి కొనుగోలు చేసేందుకు అధికారులు చేస్తున్న సంప్రదింపులు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. భూమి కొనుగోలుకు సంబంధించిన గురువారమే ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి.