ఆందోళనలో ముంపు బాధితులు
గౌరవెల్లి, గండిపెల్లి సామర్థ్యం పెంపును వ్యతిరేకి స్తున్న నిర్వాసితులు
నిర్వాసితుల పక్షాన పోరాటానికి సిద్ధమైన విపక్షాలు
అంచనాలు రూపొందించే పనిలో అధికారులు
రిజర్వాయర్ పనులు చేపట్టే దిశలో ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్ల సామర్థ్యం పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కరీంనగర్, వరంగల్ జిల్లాలోని సుమారు నాలుగు వేల మంది నిర్వాసితులు కానున్నారు. వీరిలో 80 శాతం మంది దళిత, గిరిజనులే. ముఖ్యంగా గండిపెల్లి రిజర్వాయర్ సామర్థ్యం పెంపుతో ముంపుకు గురయ్యే వారిలో నూటికి 99 శాతం గిరిజనులే కావడం గమనార్హం. తొలిదశలో నిర్వాసితులుగా మారి ప్రభుత్వ సాయంతో సమీప ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసిన రైతులు సైతం రీ డిజైనింగ్ ఫలితంగా మళ్లీ భూములు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో నిర్వాసితుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడంతోపాటు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం నేతలు నిర్వాసితుల పక్షాన ఆందోళనలు చేపడుతున్నారు. ఇప్పటికే సీపీఐ వీరికి బాసటగా వివిధ కార్యక్రమాలు చేపట్టగా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిర్వాసితులకు అండగా పాదయాత్ర నిర్వహించారు. మరోవైపు ఆయా రిజర్వాయర్ల సామర్థ్యం పెంపుకే మొగ్గు చూపుతున్న ప్రభుత్వం అంచనాలు రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే రీడిజైన్‌కు సంబంధించి సర్వే కూడా పూర్తి కావడం గమనార్హం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా రిజర్వాయర్ల పనులు చేపట్టి దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
గౌరవెల్లి నేపథ్యమిదీ...
వరద కాలువ ద్వారా మిడ్‌మానేరు జలాశయం దిగువన సుమారు రెండు లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరందించే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 2007 సెప్టెంబర్ 9న గౌరవెల్లి, గండిపెల్లి, తోటపెల్లి రిజర్వాయర్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తోటపల్లి జలాశయానికి రెండు వేలు, గౌరవెల్లి రిజర్వాయర్‌కు 1800, గండిపెల్లికి 295 ఎకరాల భూమిని సేకరించి నిర్వాసితులకు నష్టపరిహారం అందించారు. వైఎస్ మరణానంతరం సహాయ పునరావాస కార్యక్రమాలు ఆగిపోయాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేసింది. రీడిజైన్ పేరుతో 1.41 టీఎంసీల గౌరవెల్లి రిజర్వాయర్‌ను 8.23 టీఎంసీలకు, 0.148 టీఎంసీల గండిపెల్లి రిజర్వాయర్‌ను ఒక టీఎంసీ సామర్థ్యానికి పెంచుతూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. రీడిజైన్వల్ల మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరందివచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సర్కారు తాజా నిర్ణయంతో హుస్నాబాద్ మండలంలోని నాలుగు గ్రామాలు ముంపుకు గురికానున్నాయి. మొత్తం 1868 ఎకరాలను భూమిని సేకరించేందుకు అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ముంపు బాధిత ప్రాంతాలుగా ప్రకటించిన గుడాటిపల్లి, తెనుగుపల్లి, మద్దెలపల్లి, కొత్తపల్లి గ్రామాలతోపాటు తాజాగా మరో నాలుగు గ్రామాలు ముంపు బారినపడనున్నాయి. ఈసారి ముంపుకు గురయ్యే ప్రాంతాలన్నీ గిరిజన ఆవాసాలే కావడం గమనార్హం. చింతల్‌తండా, జాలుబాయితండా, సేవానాయక్‌తండా, బొంథ్యాతండా, తిరుమల్తండా, సోమాజితండాలు వీటిలో ఉన్నాయి. గండిపెల్లి రిజర్వాయర్ కోసం మరో 1152 ఎకరాల భూమిని సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో కరీంనగర్ జిల్లాలో 857, వరంగల్ జిల్లాలో 243 ఎకరాల భూమిని సేకరించేందుకు సిద్ధమయ్యారు. రీడిజైన్ వల్ల మొత్తం 16 గిరిజన తండాలు ముంపు బారిన పడనున్నాయి. వీటిలో ఏడు తండాలు కరీంనగర్, తొమ్మిది తండాలు వరంగల్ జిల్లాల్లోనివి.
ఆ ప్యాకేజీతో నష్టమే...
రీడిజైన్‌కు ముందు ఈ రెండు రిజర్వాయర్ల కింద భూమి కోల్పోయే రైతులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఎకరాకు రూ.2.10 లక్షల చొప్పున చెల్లించారు. అదే సమయంలో ఈ ప్రాంతంలోని భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ఎకరా ధర రూ.6–10 లక్షల వరకు పలికింది. సర్కారు అందించిన సాయంతో చుట్టుపక్కల భూమిని కొందామనుకున్న రైతులకు నిరాశే ఎదురైంది. తాజాగా రీడిజైన్ పేరుతో భూమిని కోల్పోయే రైతులకు 123 జీవో ప్రకారం వర్షాధార భూములకు ఎకరాకు రూ.6.5 లక్షలు, శిఖం భూములకు ఎకరాకు 5.5 లక్షల వరకు చెల్లించాలని భావిస్తోంది. ఇండ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్రూం పథకాన్ని వర్తింపజేయాలని యోచిస్తోంది. సర్కారు ఇచ్చే నష్టపరిహారంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో అరెకరం భూమి కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. ఒక్కో ఎకరా రూ.12 నుంచి రూ.15 లక్షల ధర పలుకుతోంది. దీంతో నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్వాసితులంతా గిరిజనులు, నిరక్షరాస్యులే అధికంగా ఉండటంతో భూమిని కోల్పోతే రోడ్డున పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
మేం ఒప్పుకోం..
రీడిజైన్ పేరుతో తమ భూములను లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని నిర్వాసితులు చెబుతున్నారు. చావనైనా చస్తాం కానీ పాత పద్ధతిలో భూమిని సేకరిస్తామంటే ఒక్క ఎకరా భూమి కూడా ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే గుడాటిపల్లెలో నిర్వాసితులు నిరవధిక దీక్ష చేపట్టారు. ఒకవేళæతప్పనిసరైతే 2103 పార్లమెంట్ చట్టం ప్రకారం భూసేకరణ చేయాలని కోరుతున్నారు. అందులో భాగంగా బహిరంగ మార్కెట్‌కు నాలుగు రెట్లు ధర లేదా ఎకరాకు రూ.15 లక్షల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు ఊరుకు ఊరు, తండాకు తండా నిర్మించాలని కోరుతున్నారు. ఇంటికో ఉద్యోగం, ఎస్సీ, ఎస్టీలకు భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పశువుల పాకలకు, పైప్‌లైన్, బావులు, బోర్లు, చెట్లకు ప్రత్యేక ధర చెల్లించాలని కోరుతున్నారు. రిజర్వాయర్ ఆయకట్టులో కోరిన చోటే కాలనీ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
జైలుకైనా పోతంగానీ.. భూములియ్యం
– బానోతు హేమ్లానాయక్, గండిపెల్లి
మేం జైలుకైనా పోయేందుకు సిద్ధంగా ఉన్నాం. సర్కారు చెబుతున్న రేటుకు సెంటు జాగా కూడా ఇచ్చేది లేదు. ముందు చెప్పినట్లు డ్యాం కట్ట చేస్తే చాలు. మళ్లా పెంచుడెందుకు.. మమ్ముల్ని ముంచుడెందుకు? మా భూములు ఇచ్చి మేం ఎక్కడపోయి బతుకాలే. మా పిల్లలు ఏం చేసి బతుకుతరు?
ఎకరం రూ.12లక్షల పైనే..
– బానోతు రెడ్డి, శ్రీరాంతండా
మా తండాల రూ.12 లక్షలు పెట్టినా ఎకరం భూమి దొరుకుత లేదు. డ్యాం కింద పోయే భూములకు ఐదారు లక్షలు ఇత్తమంటే ఎట్ల. నాకు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. అందులో నాలుగు ఎకరాల మామిడితోట ఉన్నది. సీజన్‌కు రూ.2లక్షల పంటలు తీసేటోళ్లం. ఆ భూములు పోతున్నయంటేనే ఏడుపొస్తుంది.