నేల తల్లికి ప్రణమిల్లుతున్న కేరళ!
2015ను అంతర్జాతీయ భూముల పరిరక్షణ సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రం భూసార పరిరక్షణ, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంతో ముందడుగేస్తోంది. దశలవారీగా సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా అవతరించనుంది. ఇప్పటికే 96% కూరగాయలు రసాయనాలు వాడకుండానే పండిస్తున్నారని వ్యవసాయ మంత్రి కేపీ మోహనన్ ఇటీవల చెప్పారు.
యువహృదయాల్లో సేంద్రియ సేద్య బీజాలు నాటేందుకు రెండేళ్లుగా కూరగాయ విత్తనాల పంపిణీ సత్ఫలితాలనిచ్చింది. తొలుత 20 పంచాయతీలను ఏప్రిల్ నాటికి సేంద్రియ సేద్య ప్రాంతంగా ప్రకటించడం.. 100 సేంద్రియ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు ప్రారంభించడం.. 2016 నుంచి దశలవారీగా రసాయనిక ఎరువుల వాడకాన్ని నిషేధించడం.. ఇవీ కేరళ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు.